elli at Inavolu Mallanna jatara : సంక్రాంతి అనంతరం వచ్చిన మొదటి ఆదివారం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. కోర మీసాల మల్లన్నను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా సోకడంతో.. సంక్రాంతికి స్వామి వారిని దర్శించుకోలేక పోయానన్న మంత్రి... కొవిడ్ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలని కోరినట్లు తెలిపారు. ఎర్రబెల్లికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ ఛైర్మన్ మార్నెని రవీందర్ రావు తదితరులు ఉన్నారు.
సల్లగ సూడు మల్లన్న
ఆదివారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. సంక్రాతి సందర్భంగా జరిగే మూడు రోజుల జాతరకు రాలేక పోయిన భక్తులు...వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కుటుంబసమేతంగా వచ్చి... మొక్కులు తీర్చుకున్నారు. ఎత్తు బోనాలు నైవేద్యంగా సమర్పించి... సల్లగా చూడు మల్లన్న అంటూ పబ్బతి పట్టారు. పాడి పంట, పిల్లాపాపలు చల్లగా ఉండాలని కోరమీసాల మల్లన్నను కోరుకున్నారు.
కరోనా భయంతో సంక్రాంతి జాతరకు రాలేదు. అప్పుడు జనాలు ఎక్కువ మంది ఉంటారని అనుకున్నాం. ఇవాళ కూడా ఎక్కువమంది వచ్చారు. మేం ప్రతి ఏడు వచ్చి మల్లన్నను దర్శించుకుంటాం. దర్శనం బాగా జరిగింది.
-భక్తులు