కరోనా వైరస్ నియంత్రణకు అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశంసించారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ మేరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరంగల్ పట్టణ, గ్రామీణ జిల్లాలో కరోనా వైరస్ నిర్మూలన, ధాన్యం, మక్కల కొనుగోలు, గోదాముల లభ్యత తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, సీపీ రవీందర్, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
అధికార యంత్రాంగం చర్యలు భేష్... ప్రజలూ బాధ్యత తీసుకోవాలి - MINISTER ERRABELLI DAYAKAR RAO REVIEW ON CORONA IN WARANGAL CITY
ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన అభివృద్ధిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
పంటల కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందొద్దన్నారు. పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని పునురుద్ఘాటించారు. కాళేశ్వరం, దేవాదుల ద్వారా నీళ్లు పుష్కలంగా రావడం వల్ల ఈసారి పంటలు సమృద్ధిగా పండాయన్నారు. పంటల ధరల కోసం 30 వేల కోట్లు ఖర్చుపెడుతున్నామని అన్నారు. మిర్చి పంటను రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వచేసుకుని... ఆరు నెలల వరకూ వడ్డీ లేని రుణం పొందవచ్చని చెప్పారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గోనె సంచల తయారీ కర్మాగారం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అంగీకరించినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.