లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తెరాస నెరవేర్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం ఎవరికీ ఇచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా సీకేఎం కళాశాల మైదానంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పట్టభద్రులతో సమావేశాన్ని నిర్వహించారు.
ప్రైవేటీకరణ పేరుతో అన్నింటినీ అమ్మేస్తున్నారు: ఎర్రబెల్లి - భాజపా నాయకులపై మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర హామీ ఏమైందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా సీకేఎం కళాశాల మైదానంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పట్టభద్రులతో సమావేశాన్ని నిర్వహించారు.
కేంద్రం పెట్రోలు, డీజీల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో రైల్వేను కూడా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆరేళ్లలో వసూలైన పన్నుల్లో ఇంకా లక్షా 20 వేల కోట్లు కేంద్రమే రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో మరో యాభైవేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. నోట్ల రద్దు సమయంలో నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ ఇప్పటివరకు ఒక్క రూపాయి వేయలేదని ఎద్దేవా చేశారు.
ప్రజలకు కావాల్సింది ప్రశ్నించే గొంతు మాత్రమే కాదని.. సమస్యలను పరిష్కరించే పల్లా రాజేశ్వర్ రెడ్డికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాశ్, నగర మేయర్ గుండా ప్రకాశ్, ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కడియం శ్రీహరి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.