తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ఆపత్కాలంలో వైద్యులు సాహసోపేతంగా పనిచేయాలని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా వారి కుటుంబ సభ్యులు సైతం చేయని సేవను ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. వరంగల్​లోని ఎంజీఎం ఆసుపత్రిలో అదనంగా మరో 250 పడకలు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు.

minister-eatala-review-meeting-with-officials-in-warangal
ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

By

Published : Jul 28, 2020, 7:15 PM IST

Updated : Jul 28, 2020, 7:43 PM IST

మెరుగైన వైద్యం అందించడం ద్వారా కరోనా రోగులకు వారి కుటుంబ సభ్యులు సైతం చేయని సేవను సర్కార్ చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మరణాల విషయంలో గోప్యత పాటిస్తున్నారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదని హితవు పలికారు.

6 గంటల పాట సుధీర్ఘ సమీక్ష

వరంగల్ ఎంజీఎంలో ప్రస్తుతం ఉన్న 250 పడకలకు అదనంగా మరో 250 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత, నియంత్రణా చర్యలపై జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 6 గంటలకు పైగా సుధీర్ఘంగా సమీక్షించారు.

చనిపోయిన 24గంటల్లో ఖననం చేయాలి

ఆపత్కాలంలో సాహసోపేతంగా పని చేయాలని వైద్యాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కరోనాతో మృతి చెందిన వారిని 24 గంటల్లోపు ఖననం చేయాలని సూచించారు. మృతదేహాలను బంధువులు నిరాకరిస్తే.. మున్సిపల్ సిబ్బందిచే ఖననం చేసే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైరస్​ బారినపడిన వారు వైద్యాధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. సకాలంలో వైద్యం పొందితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు.

ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

కార్యక్రమంలో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎంపీలు బండా ప్రకాశ్​, మాలోత్ కవిత, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్​భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: వైద్యుల పట్ల హేళన చేస్తూ.. మాట్లాడటం తగదు: ఈటల

Last Updated : Jul 28, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details