Hanamkonda Micro Artist Sujith :ఈ యువకుడికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కానీ తెలిసిన వారంతా అందులో ఏం ఉంటుంది వద్దన్నారు. ఐనా తన మనసాగలేదు. పట్టువీడకుండా కళపై సాధన చేశాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువుల్లో రాణిస్తూ మంచి ఆర్టిస్ట్‌గా ఎదుగుతున్నాడు. సందేశాత్మక కళాకృతులు రూపొందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు ఈ యువ కళాకారుడు.
Micro Artist Sujith : పెన్సిల్‌పై చక్కటి కళాకృతులు తయారు చేస్తున్నఈ యువకుడి పేరు శ్రీజిత్. హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌లోని అరుణోదయ కాలనీలో ఉంటున్న ఓ సాధారణ కుటుంబానికి చెందినవాడు. ఓ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఇతడికి....కళలంటే మక్కువ ఎక్కువ. దాంతో ఓ వైపు చదువుతూనే మరోవైపు అద్భుత కళాకృతులను సృష్టిస్తున్నాడు. శ్రీజిత్ 8వ ఏట నుంచే ఈ కళాకృతులు తయారు చేయడం నేర్చుకున్నాడు. తొలుత సరదాగా మొదలుపెట్టినాతరువాత.... దీక్షగా చేయడం ప్రారంభించాడు. తన మేన మామ, తండ్రి, ఇతర కళాకారులు ఇచ్చిన పోత్సహంతో మరింత ఉత్సాహం తెచ్చుకుని అనేక కళాకృతు లు అందంగా తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ యువకుడు.
- ఒకేసారి 10 లక్షల మంది యోగా.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సిగరెట్‌పై 7186 అక్షరాలు రాసి యువకుడి రికార్డ్
"పెన్సిల్, చాక్‌పీస్ మీద వేస్తుంటాను. ఆబ్జెక్ట్‌ను బట్టి మెటీరియల్ మారుతూ ఉంటుంది. ఈ మైక్రో ఆర్ట్స్ అనేవి మా మామయ్య నుంచి నేర్చుకున్నాను. బియ్యపు గింజపై జాతీయ జెండాను వేశాను. చాలెంజింగ్‌గా తీసుకుని 15నిమిషాల్లో జెండాను వేశాను. ఒక్క ఆర్ట్ వేయాలంటే గంటపైనే సమయం పడుతుంది. 108 లింగాలను గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించాలని చేశాను." - శ్రీజిత్, కళాకారుడు
పెన్సిల్‌పైనే కాక చాక్‌పీస్, బియ్యం గింజలపై తన ప్రతిభను చాటుతున్నాడు శ్రీజిత్. మాతృదినోత్సవం రోజున 12 మిల్లీ మీటర్ల ఎత్తులో బిడ్డను లాలిస్తున్నతల్లి బొమ్మను చెక్కాడు. బియ్యం గింజపై జాతీయ జెండా రూపొందించాడు. అది కూడా 6 మిల్లీ మీటర్ల ఎత్తుతో 15 నిమిషాల్లో పూర్తి చేశాడు. చాక్‌పీస్ పై 108 శివలింగాలను రోజుకి 2 గంటలు శ్రమించి , 7 రోజుల్లో తయారు చేశారు.