కమ్యూనిటీ టాయిలెట్లను సమర్థవంతంగా నిర్వహించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి.. అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ, మెప్మా, అర్బన్ మేనేజ్ మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణపై ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో కమిషనర్ పాల్గొని పలు సూచనలు చేశారు.
పట్టణ ప్రగతిలో భాగంగా 88 ప్రదేశాల్లో 228 యూనిట్లు ఏర్పాటయ్యాయని, వాటిలో 8 ట్రాన్స్జెండర్లకు, మిగిలిన 80 కమ్యూనిటీ టాయిలెట్స్ మహిళా పొదుపు సంఘాలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నిర్వహణ ఖర్చుల కోసం ప్రతి నెల రూ. 16 వేలు అందిస్తున్నట్లు చెప్పారు.
కేఫ్‌ల నిర్వహణ
సమాజంలో ట్రాన్స్జెండర్లు గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో బల్దియా ద్వారా వారికి ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అత్యాధునికంగా నిర్మించిన 2 లూ కేఫ్‌ల నిర్వహణ బాధ్యతలను కూడా ట్రాన్స్ జెండర్లకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. కేఫ్ విజయవంతంగా నిర్వహించుటకు వివిధ రకాల రుచికరమైన చిరు తిండ్ల, టీల తయారీకి అవసరమగు మేకింగ్ మెషీన్ల కొనుగోలుకు అవసరమైతే రుణం అందిస్తామన్నారు.
ట్రాన్స్ జెండర్లు మహిళా సంఘాల్లో సభ్యత్వం తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. వారికి నర్సరీల నిర్వహణలోనూ అవకాశం కల్పిస్తామని అన్నారు.
ఇదీ చదవండి:ముగిసిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తు గడువు