we want justice: 2021-22 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, ఎండీ కోర్సులకు.. నీట్ ర్యాంకుల ఆధారంగా వైద్య సీట్ల భర్తీని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం చేపట్టి విద్యార్ధులకు ప్రవేశం కల్పించింది. మార్చి నుంచి తరగతులు ప్రారంభం కాగా.. మే 19న ఎంఎన్ఆర్, టీఆర్ఆర్, మహావీర్ వైద్య కళాశాలల ప్రవేశాలను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో.. 550 మంది పీజీ, యూజీ వైద్య విద్యార్ధుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
అదనపు సీట్లు కేటాయింపు చేయాలని ఎన్ఎంసీ చెబుతుంటే.. సరైన మార్గదర్శకాలు లేవని, సాంకేతికంగా సమస్యలు ఎదురైతాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతుండడంతో.. ఇటు జాతీయ వైద్య కమిషన్, వర్సిటీ అధికారుల నడుమ విద్యార్ధులు నలిగిపోయి రోడ్డెక్కారు. ఎన్ఎంసీ ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేయమని చెప్పినా తీవ్ర జాప్యం జరుగుతోందని ఇటు వర్సిటీ కానీ... అటు ప్రభుత్వం కానీ స్పందించటం లేదని వైద్య విద్యార్థులు చెపుతున్నారు.
విద్యా సంవత్సరం కోల్పోతామని భయం: ప్రభుత్వానికి, వర్సిటీ వీసీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో... ఈరోజు మూడు కళాశాలలకు చెందిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు వర్శిటీ ముందు ధర్నా చేపట్టారు. వర్షంలోనూ విద్యార్ధులు తమ నిరసన కొనసాగించారు. తమ సీట్లు పునరుద్ధరించాలని... విద్యార్ధులు, తమ పిల్లలకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కళాశాలల యాజమాన్యాలు తప్పు చేస్తే.. శిక్ష తమకెందుకని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. వర్సిటీ అధికారుల జాప్యం వల్ల విద్యాసంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందని.. తమకు సత్వరమే న్యాయం చేయాలని విద్యార్ధులు వేడుకుంటున్నారు.