PG Medical student Preethi Died: నిత్యం నవ్వతూ చలాకీగా ఉండే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి... 26 ఏళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన విద్యా కుసుమం... అర్థాంతరంగా అందరికీ దూరమైంది. పరిస్ధితి అత్యంత విషమమని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఎక్కడో ఓ చిన్న ఆశ. ఆమె మృత్యుముఖం నుంచి బయటకు వస్తుందని, రావాలని అంతా ఆశించారు.
కన్నబిడ్డలాగే భావించి, క్షేమంగా తిరిగిరావాలని ప్రార్ధించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రీతి ఇక సెలవంటూ... శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. కన్నవారు, తోబుట్టువులకు, ఇతర కుటుంబసభ్యులకు.. తోటి విద్యార్ధులకు తీరని వేదనని మిగిల్చింది. ధరావత్ ప్రీతి కాకతీయ వైద్య కళాశాలలో అనస్తీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్ధిని.
Kakatiya Medical College Preethi Died: స్వస్ధలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు గిర్నితండా. తండ్రి ధరావత్ నరేందర్ హైదరాబాద్‌లో ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. హాస్టల్‌లో ఉంటూ వైద్యవిద్యను అభ్యసిస్తున్న ప్రీతి పట్ల సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ మొదటి నుంచి కోపాన్ని ప్రదర్శించేవాడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో కళాశాలలో చేరిన నాటి నుంచి నిందితుడు సైఫ్‌తో రోజూ ఇబ్బందులే.
డిసెంబర్ 6న రోగికి అవసరమైన ఊపిరి తీసుకునే పైప్ ఎందుకు తీసుకురాలేందంటూ ప్రశ్నించడం. ఆ తర్వాత కూడా బాసిజం చూపించడం రివాజుగా మారింది. సైఫ్ వేధింపుల విషయం ప్రీతి తన తండ్రి నరేందర్‌కి తెలియ చేయగా, ఆయన స్ధానిక ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌కు చెప్పగా, ఆయన హెచ్‌వోడీకి తెలియజేశారు. ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. విభాగాధిపతితో ప్రీతి తన ఆవేదనను తెలియపరిచింది.