9 Medical Colleges Inauguration in Telangana :రాష్ట్ర సర్కార్ వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందనడానికి తాజాగా అందుబాటులోకి వచ్చిన 9 వైద్యకళాశాలలే నిదర్శనమని మంత్రులు అన్నారు. ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో ఆయా జిల్లాలవారిగా పాల్గొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ మెడికల్ కళాశాలను ప్రారంభించారు. గత నాయకుల పాలనలో విద్య, వైద్య రంగాలు మరుగున పడ్డాయని.. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వాటికి పెద్దపీట వేశామన్నారు. దేశంలో 27 రాష్ట్రాలు కలిసి సంవత్సరానికి 57శాతం డాక్టర్లను ఉత్పత్తి చేస్తే ఒక్క తెలంగాణ 43శాతం డాక్టర్లను తయారుచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపుతుందని విమర్శించారు.
"ప్రధాని మోదీ దేశంలో 157 వైద్య కళాశాలలు మంజూరు చేశారు. అందులో రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ఎందుకు అని అడిగాం. మోదీ ఇవ్వకపోయినా రాష్ట్రంలో కాలేజీలు నిర్మించి.. దేశానికే ఆదర్శంగా నిలిచాం."-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
Minister Inaugurates Medical Colleges : ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో వైద్యకళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్పీకర్.. రాష్ట్రంలో 5 వైద్య కళాశాలలు ఉంటే వాటిని 28కిపెంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని కొనియాడారు. పేదప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో రాష్ట్రం.. విప్లవాత్మకమైన ప్రగతిని సాధించిందని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి(Indra Karan Reddy) ప్రారంభించారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాల ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలంపల్లి దర్గాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ.. జిల్లాతో పాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.