వరంగల్ మహా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. మేయర్ గుండా ప్రకాష్ నేతృత్వంలో ఏర్పాటైన సమావేశానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 58 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లతోపాటు బల్దియా అధికారులు హాజరయ్యారు. పట్టణ ప్రగతికై ఏర్పాటైన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్ హాజరుకాగా శాసనసభ్యులు గైర్హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడు బడ్జెట్లలో వరంగల్ మహా నగర పాలక సంస్థకు తొమ్మిది వందల కోట్లను కేటాయించారని కేవలం 83 కోట్లను మాత్రమే విడుదల చేశారని..నిధులను రాబట్టడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని అధికార పార్టీ కార్పొరేటర్ రవీందర్ మేయర్ ఎదుట ఆవేదన వెళ్లబుచ్చారు. 2016-17 సంవత్సరంలో ప్రతిపాదించిన పనుల ఇప్పటికీ కాలేదని కార్పొరేషన్ టెండర్లంటేనే కార్పొరేటర్లు బెంబేలెత్తుతున్నారు అని వ్యాఖ్యానించారు.