నాడు ఏ ఎన్‌కౌంటర్(ENCOUNTER) జరిగినా తమ వాళ్లు సురక్షితంగానే ఉన్నారా అని ఆరా తీస్తూ ఆందోళన చెందేవారు. నేడు ఒక్కొక్కరినీ కరోనా(CORONA) మహమ్మారి పొట్టనపెట్టుకుంటుండడంతో అడవిలో అయినవాళ్ల (MAOIST) ఆరోగ్యం ఎలా ఉందోనని ఆవేదనలో ఉన్నారు.
ఎట్లున్నవ్ కొడుకా.. ఎక్కడున్నవ్ నాన్నా..
By
Published : Jul 7, 2021, 10:37 AM IST
నమ్మిన సిద్ధాంతం కోసం తల్లిదండ్రులను, కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యలను వదిలి ఎంతో మంది అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌లో(PEOPLESWAR) చేరి ఉద్యమ పంథాలో కొనసాగుతూ జన జీవన స్రవంతికి దూరంగా జీవిస్తున్నారు. దశాబ్దాల క్రితమే ఇంటిని వదిలి వెళ్లిపోయినా, వారి కుటుంబీకులు మాత్రం తమ వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉంటున్నారు. తిరిగి రాకున్నా ప్రాణాలతోనైనా బతికుండడం చాలని ఇన్నాళ్లూ భావించారు. ఇప్పటి వరకు ఎన్‌కౌంటర్ల(ENCOUNTER)లో బలైన మావోయిస్టులకు ఇప్పుడు కరోనా రూపంలో కొత్త శత్రువు దాపురించింది.
తాజాగా కరోనా కాటుకు అనేక మంది మావోయిస్టులు వైరస్(MAOIST CORONA) బారిన పడి విలవిలలాడుతున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ ఇటీవల కొవిడ్‌తో మరణించగా, వారి కుటుంబీకులకు కడ చూపైనా దక్కలేదు. ఆయన భార్య సారక్క కరోనా బారిన పడి తుదిశ్వాస విడిచారనే ప్రచారం జరిగినా మావోయిస్టులు ధ్రువీకరించలేదు. అంతకుముందే ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ధబోయిన సారక్క అలియాస్ భారతక్క కొవిడ్‌తో మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ నుంచి పెద్ద సంఖ్యలో దశాబ్దాల క్రితమే దళంలోకి వెళ్లిన వారు ఉన్నారు. వారిలో కొందరి కుటుంబ సభ్యులను ‘ఈనాడు - న్యూస్‌టుడే’ పలకరించింది.
మళ్లీ కొడుకును చూడలేదు
వరంగల్ అర్బన్ జిల్లా తరాలపల్లికి చెందిన సాంబయ్య అలియాస్ ప్రభాకర్ సెంట్రల్ కమిటీ నాయకుడిగా కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఈయన 16 ఏళ్ల వయసులో 30 ఏళ్ల క్రితం దళంలోకి వెళ్లాడు. తల్లిదండ్రులు ముప్పిడి భద్రమ్మ, రామస్వామి కురు వృద్ధులు. వీరికి ఇద్దరు బిడ్డలు, ముగ్గురు కొడుకులు కాగా చిన్న కొడుకు ఎన్‌కౌంటర్లో మృత్యువాత పడ్డాడు. రెండో కొడుకు సాంబయ్య. పండుటాకులైన ఈ తల్లిదండ్రులు ఇంటి వద్ద ఇద్దరే ఉంటూ జీవన పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు తమ కొడుకు ఎలా ఉన్నాడోనని, తాము బతికున్నప్పుడు ఒక్కసారైనా కొడుకు మళ్లీ చూస్తామా అంటూ భద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. రామస్వామి గ్యాంగ్‌మెన్‌గా పనిచేసి 15 ఏళ్ల క్రితమే విరమణ పొందారు. తమ ఇంటికి పోలీసులు ఎప్పుడొచ్చినా తమ కొడుక్కు ఏదో జరిగిందన్న వార్త చెప్తారని బుగులు పుడుతుందని, జీవితమంతా కష్టపడ్డామని, ఈ పరిస్థితుల్లో తమ కన్న కొడుకును ఆ దేవుడే కాపాడాలని ఈ అమ్మానాన్నలు ఉబికొస్తున్న కన్నీటిని తుడుము కుంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
అప్పుడు మూడునెలల బాబు
వరంగల్ నగర శివారులోని టేకులగూడేనికి చెందిన యేశోబు అలియాస్ జగన్ 1991లో పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. ఇప్పుడు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్టు తెలిసింది. భార్య మాచర్ల లక్ష్మికి ముగ్గురు ఆడపిల్లలు చివరగా ఒక బాబు. అందరిలో చిన్నవాడైన మహేశ్‌చంద్రను పలకరించగా వాళ్ల నాన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మహేశ్ సరిగ్గా మూడు నెలల వయసున్నప్పుడు 1991లో యేశోబు అజ్ఞాతంలోకి వెళ్లారు. 2004లో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సమయంలో నర్సంపేటలో మహేశ్ 13 ఏళ్ల వయసులో నాన్నను ఒక్కసారి మాత్రమే చూశాడట. ఎవరైనా దళ సభ్యులు లొంగిపోతే మాత్రమే వారి ద్వారా తండ్రి యోగక్షేమాలు తెలుసుకునేవారు. తండ్రి దూరంగా ఉండడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల పాలైంది. అయినా కూడా మహేశ్ కష్టపడి చదువుకొని కేయూలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి పెళ్లి చేసుకొని జూనియర్ అడ్వకేట్‌గా స్థిరపడ్డారు. ఒకప్పుడు ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు నాన్నకు ఏమైందోనని ఆందోళన చెందేవారమని, ఇప్పుడు కొవిడ్ బెంగ పట్టుకుందని మహేశ్ తాను జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరవు పెట్టారు. టేకుల గూడెం నుంచి సుమారు అయిదుగురు అజ్ఞాతంలోకి వెళ్లగా, అందులో ముగ్గురు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఒకరు లొంగిపోగా, యేశోబు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.
ఎప్పటికైనా వస్తాడని
కొడుకు ఉద్యమ బాట పట్టడంతో తమలోని బాధను దిగమింగి జీవనం సాగిస్తున్నారా అమ్మానాన్నలు. కాటారం మండలం అంకుశాపూర్‌కు చెందిన అన్నె ఐలోని-సమ్మక్క దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు అన్నె సంతోష్ అలియాస్ శ్రీధర్ 1999లో ఉద్యమబాట పట్టారు. చిన్నతనంలోనే మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై ఉద్యమంలో చేరారు. పార్టీలో చేరిన ఏడాది తర్వాత గ్రామానికి దళంతో వచ్చిన ఆయనను తిరిగి ఇంటికి రావాలని తల్లిదండ్రులు కోరినా రాలేదు. సంతోష్ 22 ఏళ్లుగా దండకారణ్యంలోనే వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం దండకారణ్యంలో మిలిట్రీ విభాగంలో డీసీఎం క్యాడర్‌లో ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టులు కరోనాతో బాధపడుతున్నట్లు, ఇటీవలే కొందరు మావోయిస్టు నేతలు చనిపోయినట్లుగా వార్తలు రావడంతో ఆ ఇంట్లో వాళ్లు చలించిపోతున్నారు. కొడుకు ఆరోగ్యం ఎలా ఉందో అని బాధ పడుతున్నారు. ముగ్గురు కుమారుల్లో ఒకరు ప్రమాదంలో చనిపోయాడని, పెద్ద కుమారుడు ఉద్యమ బాటపట్టాడని, అతని ఆరోగ్యం ఇప్పుడెలా ఉందోనని తపన పడుతున్నామని తండ్రి ఐలోని కన్నీరుమున్నీరయ్యారు.