కామ్రేడ్ శారద, కామ్రేడ్ ఇడ్మాలు ఆరోగ్యంగానే ఉన్నారని తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి (Maoist spokesman) జగన్ స్పష్టం చేశారు. పాలకులు, ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా మావోలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులు, ప్రజలు అవాస్తవాలను నమ్మి ఆందోళన పడకూడదని సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి విషయాలను పార్టీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలియజేశారు.
సామ్రాజ్యవాదులు తమ లాభాల కోసం ప్రకృతిని విధ్వంసం చేయడం వల్లే నేడు కరోనా వంటి మహమ్మారులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని జగన్ అన్నారు. వెనకబడిన దేశాల్లో వనరులను దోచుకోవడం మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కోట్లాది మంది ప్రజలు.. పనులు దొరకక, జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. పేదలు.. వైద్యం కూడ చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మేము కరోనాకు అతీతులమేమీ కాదు. మాకు మహమ్మారి సోకే అవకాశం లేకపోలేదు. కొవిడ్ సోకి కామ్రేడ్ హరి భూషణ్, కామ్రేడ్ భారతక్కలు మా నుంచి భౌతికంగా దూరమయ్యారు. అందుకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పాశవిక నిర్భంధం కూడా ఓ కారణమే. ప్రభుత్వాలు అసలు విషయాన్ని గాలికొదిలేసి.. మావోయిస్టు పార్టీల నిర్మూలనను పనిగా పెట్టుకున్నాయి. మేము ప్రజల మధ్యనే జీవిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటాం. మావోలు కరోనా బారిన పడి చనిపోతున్నారంటూ పోలీసులు ప్రజల్లో గందర గోళాన్ని సృష్టిస్తున్నారు. అవాస్తవాలను ఎవరూ నమ్మవద్దు.
- జగన్, రాష్ట్ర మావోయిస్టు అధికార ప్రతినిధి