రాష్ట్రంలో కరోనా రెండో దశ ఉద్ధృతి కాస్త తగ్గినా... ఇంకా చాలామంది మహమ్మారి ఉచ్చుకి చిక్కి ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేత్తో పట్టుకుని బతుకుతున్నారు. పచ్చని జంటలను.. కరోనా మహమ్మారి కాటేస్తోంది. కష్టాల్లో సుఖాల్లో నీవెంటే నేనుంటానంటూ బాసలు చేసుకున్న భార్యాభర్తలను కరోనా రక్కసి ఒకరికి తెలియకుండా మరొకరిని మింగేస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలు జంటలు కరోనా బారినపడి కాలంచేశాయి. పసి ప్రాయంలోనే పిల్లలు అమ్మానాన్నల ప్రేమకు దూరమయ్యేలా చేసిందీ మాయదారి వైరస్.
అనాథలుగా పిల్లలు..
మహబూబాబాద్ జిల్లాలో దేవేందర్ సుమలత దంపతులను కరోనా బలి తీసుకుంది. మహబూబాబాద్ మిలటరీ కాలనీలో.. భవన నిర్మాణ కార్మికులుగా ఇద్దరూ పనిచేస్తున్నారు. పక్షం రోజుల క్రితం కొవిడ్ బారిన పడగా.. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...6 రోజుల క్రితం సుమలత చనిపోయింది. భార్య చనిపోయిన రెండు రోజుల్లోనే భర్త దేవేందర్ మృతి చెందాడు. నిన్నటివరకూ ఆలనా పాలనా చూసే అమ్మానాన్నలు లేకపోవడంతో...వీరి పిల్లలు అనాథలయ్యారు.
నీ వెంటే.. నేనుంటా..
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన భిక్షం గత నెలలో కరోనా చికిత్స పొందుతూ హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోగా.. పదో రోజున ఆయన భార్య మంగమ్మ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఒకరికొకరు తోడు నీడగా ఉండాల్సిన వృద్ధ దంపతులను కరోనా బలితీసుకుంది.