తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయం కోసం ఇంటింటికీ తిరుగుతోంది.. బొట్టు పెట్టి మరీ వేడుకుంటోంది!

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఐదేళ్లుగా ఊసులాడుకున్నారు. అత్త కొడుకే కదా.. అని నమ్మేసింది. మానసికంగా, శారీరకంగా దగ్గరయ్యింది. కట్‌చేస్తే పెళ్లి అనగానే అతడు మొహం చాటేశాడు. పైగా కట్నం కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. చేసేది లేక ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. చావైనా... బతుకైనా ప్రియుడితోనేనని అంటోంది.

lover protest, young woman protest for love
ప్రియుడి కోసం యువతి పోరాటం, ప్రేమ కోసం యువతి పోరాటం

By

Published : Jul 31, 2021, 6:45 PM IST

ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి... ఐదేళ్లు ఊసులాడాడు. మానసికంగా, శారీరకంగా ఆమెను వాడుకున్నాడు. చివరికి కట్నం కోసం వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసనకు దిగింది. 6 రోజులుగా మౌనదీక్ష చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ గడప గడపకూ తిరుగుతూ వేడుకుంటోంది.

ఐదేళ్ల ప్రేమ

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ముల్కల గూడెంలో తనను ప్రేమించి మరో పెళ్లికి సిద్ధమాయ్యాడని ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది ఓ ప్రియురాలు. ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి తనకు తోడుగా నిలవాలని కోరింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా నమ్మించి... తనను మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని బోరున విలపిస్తోంది బాధితురాలు. గడిచిన ఆరు రోజులుగా ప్రియుడి ఇంటి ఎదుట అతడి రాకకోసం నిరీక్షిస్తోంది. ప్రియుడితోనే తనపెళ్లి జరిపించాలని వేడుకుంటోంది. బాధితురాలి పోరాటానికి మహిళా సంఘాలు బాసటగా నిలవగా... గ్రామస్థులు అన్ని తామై అండగా నిలిచారు.

ముల్కలగూడెం గ్రామానికి చెందిన థామస్ యాదవ్ ఉస్మానియా పీజీ వైద్య విద్యార్థి. అతడు మా అత్త కొడుకు. ఇద్దరం ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కానీ అతడు ఇప్పుడు అధిక కట్నం కోసం మరో అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. వేరే పెళ్లికి సిద్ధమయ్యాడు. ఏం చేయాలో తెలియక ఆరురోజులుగా థామస్ ఇంటి ముందు మౌనపోరాటం చేస్తున్నా. చావైనా బతుకైనా థామస్ తోనే. అన్ని రకాలుగా నన్ను వాడుకొని... పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అన్యాయం చేశాడు. అతడి కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తా.

-బాధితురాలు

మౌన పోరాటం

ఆరు రోజులుగా థామస్ గ్రామం ముల్కలగూడెంలో న్యాయ పోరాటం చేస్తున్నా శిరీషకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. న్యాయం జరిగేంత వరకు మౌనపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అతడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పారిపోయారని తెలిపారు. వారు ఎక్కడున్నా పోలీసులు, జిల్లా కలెక్టర్ స్పందించి ప్రేమ జంటను కలపాలని విజ్ఞప్తి చేశారు.

బాధితురాలు ప్రియుడి చేతిలోనే మోసపోయింది. ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని తెలుసుకొని మౌన పోరాటం చేస్తున్నాం. ఐదేళ్లుగా ప్రేమించి.. ఆమెతో చనువుగా ఉండి ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడు. అంతేకాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. బాధితురాలికి న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు. ప్రేమ కోసం ఎంతో మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ అమ్మాయికి అన్యాయం జరగనివ్వం. దీనిపై పోలీసులు, పైఅధికారులు బాధితురాలికి అండగా నిలవాలని కోరుతున్నాం.

-మహిళా సంఘాల సభ్యులు

ఇదీ చదవండి:VENKAIAH NAIDU: తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి: ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details