kishanreddy Visit Flood Affected Areas in Joint Warangal District : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా పోతననగర్ వరద బాధితులను పరామర్శించి.. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం చేయాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న రూ.900 కోట్ల విపత్తు నిధులు వాడాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఇస్తుందని చెప్పారు. వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. ఈ క్రమంలోనే కేంద్ర బృందాలు.. రేపటినుంచి తెలంగాణలో వరద నష్టం వివరాలు సేకరిస్తాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
kishanreddy Visit Joint Warangal District :అంతకుముందు కిషన్‌రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచల్లిలో పర్యటించారు.వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన గ్రామాల వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెనను కిషన్‌రెడ్డి పరిశీలించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో.. జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చాలా గ్రామాలు జలదిగ్భదంలో చిక్కుకున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. మరోవైపు పంటలు దెబ్బతిన్నాయని, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను కలిసి వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ బృందాలుగా పని చేస్తుందని వివరించారు. ఈ రోజూ నుంచి 3 రోజుల పాటు వరద నష్టం అంచనా కొనసాగుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.