గులాబీ బాస్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం గులాబీ బాస్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. వరంగల్, భువనగిరి బహిరంగ సభల్లో పాల్గొని తనదైన శైలిలో ప్రజలను ప్రసన్నం చేసుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ముఖచిత్రాన్ని చూపిస్తూ... దేశ రాజకీయాల్లో తమ పాత్రను వివరిస్తున్నారు. ప్రధాని పదవిపై కోరికలేదు...
దేశంలో మార్పు తీసుకురావటానికే సమాఖ్య కూటమి ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రధాని పదవిపై కోరిక లేదని కేసీఆర్ వరంగల్ ప్రచార సభా వేదికగా స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు. విద్యుత్ తలసరి వినియోగంలో, రైతులకు 24 గంటల కరెంటు లాంటి ఎన్నో అంశాల్లో దేశంలోనే మెుదటి స్థానంలో ఉన్నామన్నారు.
రెండు మాసాల్లో కొత్త రెవెన్యూ చట్టం...
కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రాబోయే రెండు మాసాల్లో సమగ్ర మార్పులు తెస్తామన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల అనంతరం ప్రతి జిల్లాలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ వరంగల్ ప్రచార సభా వేదికగా హామీ ఇచ్చారు. ఎవరికి లంచం ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
మూడు నెలల్లో కాళేశ్వరం పూర్తి...
వచ్చే రెండు మూడు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తయితే... కాల్వలన్నీ ఏడాదిలో 9 నుంచి పది నెలల పాటు నిండు గర్భిణీలాగా నీళ్లతో కళకళలాడుతాయన్నారు. యాదాద్రి జిల్లాలో 10 లక్షల ఎకరాలు పచ్చగా మారుతాయని ఆకాంక్షించారు.
ప్రపంచమే ఆశ్చర్యపడేలా...
ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుని ఏర్పాటు చేసుకున్న జిల్లాను త్వరలో ఆద్భుతమైన ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. యాదాద్రిని టూరిజం సర్క్యూట్‌గా మార్చే బాధ్యత తనదేనని గులాబీబాస్ స్పష్టం చేశారు.
తనదైన శైలితో... జోష్
తెలంగాణ హక్కులు, ప్రాజెక్టులకోసం తప్పకుండా తెరాస ఎంపీలు గెలవాల్సిందేనని గులాబీ బాస్ వెల్లడించారు. కాంగ్రెస్, భాజపా ఎవరు గెలిచినా దిల్లీకి గులాములేనని ఎద్దేవా చేశారు. మోదీ,రాహుల్ ముందు సిట్ అంటే సిట్ ,స్టాండ్ అంటే స్టాండ్ అంటూ తనదైనశైలితో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
ఇవీ చూడండి:"నిండు గర్భిణీలెక్క కాల్వలు కళకళలాడుతయి"