Tenth Hindi Question Paper Leak Latest Issue : ఇటీవల పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో డీబార్ అయిన కమలాపురం విద్యార్థి హరీశ్ తండ్రి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో మాల్ ప్రాక్టీస్ కేటగిరీలో హరీశ్ ఫలితాలను బోర్డు నిలిపివేసింది. దీంతో తన కుమారుడి ఫలితాలను వెల్లడించేలా.. సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ హరీశ్ తండ్రి ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా విద్యార్థి హరీశ్ అప్పుడు రాయలేకపోయిన రెండు పరీక్షలను సప్లిమెంటరీలో రాసేలా అనుమతించాలని ఎస్ఎస్‌సీ బోర్డును ఆదేశించింది. రెండు పరీక్షలకు సప్లిమెంటరీ ఫీజు స్వీకరించాలని బోర్డుకు తెలిపింది. ఈ మేరకు తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలతో మిగిలిన పరీక్షలకు..: వరంగల్ జిల్లాలోని కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో విద్యార్థి హరీశ్ వద్ద నుంచి పేపర్ బయటకు వచ్చినట్టు తేలడంతో అతడిని ఐదేళ్ల పాటు డీబార్ చేశారు. ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు వచ్చిన అతడి వద్ద నుంచి హాల్ టికెట్ తీసుకుని.. పరీక్షకు అనుమతించ లేదు. ఈ విషయంలో హరీశ్ తండ్రి గతంలో హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.