Kakatiya University students Concern: తెలంగాణలోని యూనివర్సిటీల సమస్యలు నాటినాటికి పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. యూనివర్సిటీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్ద విద్యార్థులు బైఠాయించి, నిరసనలు తెలిపారు.
విద్యార్థుల పట్ల కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. వసతి గృహాల్లో చాలా మంది పేద, మధ్యతరగతులకు చెందిన విద్యార్థులే ఉంటూ చదువుతున్నారని అన్నారు. ఎంతో మంది విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటున్నారని.. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్లిపోవాలని ప్రశ్నించారు.