బీటెక్, బీఫార్మసీ చదవబోయే విద్యార్థులకు రుసుములను రెట్టింపు చేసి కాకతీయ విశ్వవిద్యాలయం(KAKATIYA UNIVERSITY) కూడా షాక్ ఇచ్చింది. జేఎన్‌టీయూహెచ్(JNTUH), ఉస్మానియా విశ్వవిద్యాలయాల(OU) తరహాలోనే కేయూ సైతం రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను రెండింతలు పెంచింది. నెలన్నర క్రితం ఆయా కోర్సుల రుసుములను పాలకమండలి ఆమోదం తీసుకొని పెంచుకోవచ్చని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈక్రమంలో ఇటీవల ఓయూ, జేఎన్‌టీయూహెచ్ తమ పరిధి ప్రభుత్వ కళాశాలల్లో బీటెక్ రుసుములను రెండింతలు పెంచటం తెలిసిందే. అప్పటికి వరంగల్‌లోని కాకతీయ, నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా కాకతీయ వర్సిటీ కూడా బీటెక్ రెగ్యులర్ ఫీజును రూ.18వేల నుంచి రూ.35వేలకు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ.35వేల నుంచి రూ.70 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త రుసుములను ఎంసెట్ ప్రవేశాల కమిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీనివల్ల కేయూ పరిధిలోని వరంగల్, కొత్తగూడెంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరే విద్యార్థులపై భారం పడనుంది. ఆయా కళాశాలల్లోని రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రుసుములు వేర్వేరుగా ఉన్నందున వాటిని గమనించి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సుల్తానాపూర్ బీఫార్మసీ ఫీజు రూ.65వేలు
ఈ విద్యా సంవత్సరం జేఎన్‌టీయూహెచ్ తన పరిధిలోని సుల్తానాపూర్(సంగారెడ్డి జిల్లా) కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద బీఫార్మసీ కోర్సు ప్రారంభించింది. దాని ఫీజు రూ.65 వేలుగా నిర్ణయించారు. అంటే బీటెక్ కంటే రూ.5వేలు తక్కువ. కాకతీయ వర్సిటీలో మాత్రం బీఫార్మసీ రెగ్యులర్ కోర్సుకు ఫీజు రూ.45 వేలు ఉంది. బీటెక్ రెగ్యులర్ కోర్సు రుసుం కంటే అది రూ.10 వేలు ఎక్కువ కావటం గమనార్హం.