Nobel Peace Prize Winner Kailas Satyarthi interacting with students: బాలల హక్కుల పరిరక్షణ, విద్యావకాశాలు.. బాల్యవివాహాల నిరోధానికి కల్యాణ లక్ష్మి, బాలికార్మిక వ్యవస్థ రద్దు కోసం.. తెలంగాణ సర్కార్ చేపట్టిన పథకాలు బాగున్నాయంటూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్ధి కొనియాడారు. చిన్నారుల హక్కులను కాలరాయకుండా వారిపై దాడుల జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదిపై ఉందన్నారు.
హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన సభలో విద్యార్థులతో ముచ్చటించారు. తనకు నోబెల్ బహుమతి ఎలా వచ్చిందో.. విద్యార్థులకు కైలాశ్ తెలియచేస్తూ.. లైంగిక దాడులను మౌనంగా భరించకుండా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే అవి తగ్గుముఖం పడతాయని బాలలకు సూచించారు. కులమతాలను పక్కన పెట్టి.. దేశమంతా ఒకటేనని.. మనుషులంతా ఒక్కటే అన్న భావన కలిగి ఉండాలని ఉద్భోధించారు. మన కోసం కలలు కనకుండా సమాజం బాగు కోసం కలలు కని వాటిని నెరవేర్చుకోవాలని సూచించారు. బాల కార్మికులు ఎక్కడ కనపడినా వివరాలు అధికారులకు తెలియచేయాలని కోరారు.
"మిమ్మల్ని ఎవ్వరైనా చెడు బుద్ధితో ముట్టుకుంటే బయటకు చెబుతారా? బయటకు చెబితే తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారని ఆలోచన చేయవద్దు. అతను మీ బంధువైనా, కుటుంబ సభ్యులైనా.. చెడు బుద్ధితో ముట్టుకుంటే బయటకు చెప్పాలి. అప్పుడు ఎలాంటి నేరాలకు ఆస్కారం ఉండదు." - కైలాశ్ సత్యార్థి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత