Problems in Mid Day Meal in Warangal : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలను కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పలుచోట్ల మధ్యాహ్న భోజనంలో సమస్యలు తలెత్తుతున్నాయి. బియ్యంలో పురుగులు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని ఓ పాఠశాలలోని పరిస్థితులు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట జడ్పీహెచ్ఎస్ మోడల్ పాఠశాల ఆవరణలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో 180 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో గత విద్యా సంవత్సరం సరఫరా అయిన బియ్యాన్ని ప్రస్తుతం వంటకు వినియోగిస్తున్నారు. దీంతో ఆ బియ్యం పురుగులు పట్టాయి. పాఠశాలలు పునః ప్రారంభం అయిన తర్వాతా అదే బియ్యాన్ని వంటకు ఉపయోగిస్తున్నారు.
పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము.. 25 మంది చిన్నారులకు అస్వస్థత!
Problems in Mid Day Meal in Narsampeta : ప్రతి రోజూ బియ్యంలో పురుగులను తీసి వేసేందుకు వంట ఏజెన్సీ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంత జాగ్రత్తగా వాటిని బియ్యం నుంచి వేరుచేసినా.. భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ ఆహారాన్ని విద్యార్థులు చూసి తినకుండానే పక్కన పడేస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు బలవంతంగా కాస్త అన్నం తింటున్నారు. ఈ విషయం ప్రధానోపాధ్యాయుడికి తెలిసి.. అధికారులకు సమస్యను వివరించారు. పాత బియ్యం బస్తాలు వెనక్కి తీసుకుని.. కొత్తవి సరఫరా చేయాలని అధికారులను కోరారు.