వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి జాతర... ఆద్యంతం కోలాహలంగా సాగుతోంది. ఉత్సవాలకు... తెలుగు రాష్ట్రాలతో పాటు... ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. శరణు శరణు మల్లన్నా అంటూ భక్తులు బారులు తీరుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా మల్లన్నను భావించి తండోప తండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ఆవరణలోనే విడిది చేస్తున్న భక్తులు... బోనాలతో ప్రదక్షిణ చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయం శివసత్తుల నృత్యాలతో సందడి నెలకొంది. ఒగ్గు పూజరులు పట్నాలు వేయగా... సంతానం కోసం మహిళలు వరాలు పట్టి.. కోడెలు కట్టేందుకు పోటీ పడ్డారు.
'పసుపు, బియ్యం పిండితో పట్నం.. మల్లన్న కల్యాణం'
ఆలయ గర్భగుడిలో ఉత్తరం వైపు భక్తులు టెంకాయ ముడుపు కట్టడం ఇక్కడ ఆనవాయితీ. గండాలు తీరితే గండ దీపం, కోరికలు తీరితే కోడెను కట్టడం తరతరాల ఆచారం. యాదవుల కులదైవంగా కొలుస్తున్న మల్లికార్జున స్వామిని ఒగ్గు కళాకారులు పసుపు, బియ్యం పిండితో పట్నం వేసి మల్లన్నను కొలుస్తారు. ఇలా చేయడాన్ని స్వామి వారి కల్యాణంగా భావిస్తారు. జాతరకు వచ్చే భక్తులు పట్నం వేసి మట్టి కుండల్లో నైవేద్యం తయారు చేసి మల్లన్నకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు.