తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో జోరుగా సాగుతోన్న అక్రమ ఇసుక రవాణా - Illegal sand latest news

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాగుల్లో ఇష్టారాజ్యంగా తోడుతున్నారు. కొన్ని చోట్ల మట్టితో కూడిన ఇసుక వస్తే దానిని ఫిల్టర్‌ చేస్తూ పట్టణాలకు తరలిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో పక్కదారి పట్టిస్తున్నారు. ఇసుకాసురుల నుంచి ఆమ్యామ్యాలు పుచ్చుకుంటున్న అధికారులు ప్రతిరోజు రూ.లక్షల విలువ చేసే ఇసుక అడ్డదారిలో అంగట్లోకి వెళుతున్నా పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణా వల్ల గ్రామ పంచాయతీకి, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తుకు రావాల్సిన సీనరేజీకి గండి పడుతోంది. ఇసుక రవాణా అరికట్టని కారణంగా ఇటీవల నర్సింహులపేట తహసీల్దారు సస్పెండ్‌కు గురయ్యారు.

Illegal sand smuggling in combined warangal district
అభివృద్ధి పేరుతో తరలింపు.. స్థానిక సంస్థల ఆదాయానికి గండి

By

Published : Sep 28, 2020, 1:49 PM IST

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఆకేరు, పాలేరు, మున్నేరు వాగుల్లోంచి ప్రతి రోజూ 500 ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది. నెల్లికుదురు మండలంలో ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోంది. నర్సింహులపేట పరిధిలోని ఆకేరు వాగులోంచి రెవెన్యూ అధికారుల అనుమతితో ప్రభుత్వ అభివృద్ధి పనులు పేరిట రవాణా చేస్తున్నా అక్రమంగానే అమ్మకాలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఆర్డీవో 50 ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్‌ను సూచిస్తే ఇదే సాకుతో ఆయన ఏకంగా 230 ట్రాక్టర్ల వరకు అనుమతులు ఇచ్చారు. ఈ ఘటనపై కలెక్టర్‌ తహసీల్దార్‌ పున్నం చందర్‌ను సస్పెండ్‌ చేశారు. డిప్యూటీ తహసీల్దారును, ఆర్‌ఐను బదిలీ చేశారు.

జనగామ జిల్లాలో...

జఫర్‌గడ్‌ మండలం ఉప్పుగల్లు, కూనూరు, తిగుడు, కోనాయచలం, రఘునాథపల్లి మండలం మండలగూడెం, ఖిలాషాపూర్‌, బచ్చన్నపేట మండలం పోచన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలోని తాటికొండ, చిల్పూరు, పల్లగుట్ట దేవరుప్పుల మండలం యశ్వంతాపూర్‌ ప్రాంతాల వాగుల్లోంచి ఇసుక రవాణా సాగుతోంది. ప్రతి రోజూ 400 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు.

భూపాలపల్లి, ములుగు జిల్లాలు

టేకుమట్ల, మొగుళ్లపల్లి, మల్హర్‌, చిట్యాల ప్రాంతాల్లోని మోరంచవాగు, చలివాగు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు మూడు పువ్వులు-ఆరు కాయలు అన్న చందంగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ప్రతి రోజు 150 ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఆరు నెలల్లో 100 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అయినా అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. ములుగు జిల్లాలోని వాగుల్లోంచి కూడా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

వరంగల్‌ రూరల్‌ జిల్లా

వర్ధన్నపేట మండలం కొత్తపల్లి, ఇల్లంద, ల్యాబర్తి సమీపంలోని ఆకేరు వాగులోంచి ప్రతి రోజూ ఎలాంటి అనుమతులు లేకుండా వరంగల్‌ నగరానికి 300 ట్రాక్టర్ల ఇసుక రవాణా జరుగుతోంది. ఇసుక తరలింపు సమయంలో ఎస్కార్ట్‌ రూపంలో ట్రాక్టర్ల యాజమానులు కిలోమీటర్ల దూరంలో ద్విచక్ర వాహనాలపై వెళతారు. మధ్యలో ఎక్కడైనా తనిఖీలు చేస్తుంటే వెంటనే ట్రాక్టర్ల డ్రైవర్లకు ఫోన్‌ చేస్తారు. దాంతో ట్రాక్టర్లను చెట్ల చాటుకు, గ్రామాల్లోనైతే సందుల్లోకి మళ్లిస్తున్నారు. కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల్లో అక్రమార్కులు యూనియన్లుగా ఏర్పడ్డారు. పక్క గ్రామాల ట్రాక్టర్లు ఇసుకను నింపుకునేందుకు వస్తే ఊరుకోవడంలేదు. జరిమానా విధిస్తున్నారు. మండలాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా

ఐనవోలు మండలం నందనం-రాంనగర్‌ గ్రామాల మధ్యన ఉన్న ఆకేరు వాగులో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. వాగు ప్రాంతంలోని ఇసుక భూములను కూడా అక్రమార్కులు రైతుల నుంచి లక్షల రూపాయలకు కొనుగోలు చేసి నింబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రతి రోజూ 500 ట్రాక్టర్ల ద్వారా వరంగల్‌ పట్టణానికి ఇసుక తరలుతోంది.

సీనరేజీకి గండి..

ఇసుక తవ్వకాలకు సంబంధించి గ్రామ పంచాయతీకి 25శాతం, మండల పరిషత్తు 50శాతం, జిల్లా పరిషత్తుకు 25శాతం చొప్పున అందాల్సిన సీనరేజీకి గండి పడుతోంది. ఇదంతా అధికారులకు తెలిసినా అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

  • రోజువారీ ఇసుక అక్రమ రవాణా ఇలా..
  • ట్రాక్టర్లు: 1,850
  • ఒక ట్రాక్టర్‌లో రవాణా 3 క్యూబిక్‌ మీటర్లు
  • మొత్తం తరలిస్తోంది 5,550 క్యూ.మీ
  • ఒక ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.5 వేలు
  • అక్రమార్కులు పొందుతున్న ఆదాయం: రూ.92.5 లక్షలు

ఇదీ చూడండి:ఆచరణలో లేని ముఖ్యమంత్రి మాట: వీహెచ్

ABOUT THE AUTHOR

...view details