కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల వరకు నిర్మిస్తున్న నాలుగు వరసల రహదారి నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. 2016 సెప్టెంబర్‌లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎంతో అట్టహాసంగా రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరలోనే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. రహదారి నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉంది. శంకుస్థాపన జరిగి అయిదేళ్లు గడుస్తున్నా నేటికీ రహదారి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా మారింది. రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ రోడ్డు వేసి నిలిపివేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
నిధులున్నా..
హుజూరాబాద్ శివారులోని పరకాల క్రాస్ రోడ్డు నుంచి పరకాల వరకు నాలుగు వరసల రహదారి నిర్మాణం గత అయిదేళ్లుగా కొనసాగుతోంది. పరకాల-హుజూరాబాద్ 30.5 కిలోమీటర్ల నిడివి రహదారి నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరు చేశారు. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణంతో కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారికి, కాళేశ్వరం జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. అయితే నేటికీ ఈ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మాణానికి నోచుకోనేలేదు. అక్కడక్కడా కంకర పోసి వదిలిపెట్టారు. దీంతో ఈ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా రహదారిపై ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. -శోభన్ బాబు, కమలాపూర్
30కి.మీల రహదారి పనులకు అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో టెండర్లను ఆహ్వానించారు. గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. గుంతలు, కంకరరోడ్లపై ప్రయాణాలు చేయాలంటే భయంగా ఉంది. తోట సురేష్, ఉప్పల్ గ్రామం