Huge Response To Mahalakshmi Scheme in Joint Warangal District :రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని తొమ్మిది డిపోలలోని బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. వారాంతాల్లో అయితే ఈ రద్దీ మరింతగా ఉంటోంది. హనుమకొండ నుంచి వేములవాడ, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు కూడా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గత వారం రోజులుగా టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళలకు, ఇప్పుడు కండక్టర్లుజీరో టికెట్లు (TSRTC Zero Tickets) ఇస్తున్నారు.
TSRTC Zero Tickets for Women : టికెట్లపై ఛార్జీ సున్నా అని చూపించినా, ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో అందులో నమోదవుతుంది. ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఇప్పటివరకు 11 లక్షల మంది మహిళలు ప్రయాణించారని, జాతరలకు వెళ్లే భక్తులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.
ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ప్రయోజనం - మహాలక్ష్మి పథకంపై మహిళల ఆనందం
"మొత్తం 100 శాతంలో 60 శాతం మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. జీరో టికెట్ అంటే వారు ఎంత చెల్లించాలనేది దానిలో ఉంటుంది. వాటన్నింటిని మేము ప్రభుత్వానికి అందిస్తాం. ఆ విధంగా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది. మహాలక్ష్మి పథకాన్ని మహిళలు చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. జాతరలకు వెళ్లే భక్తులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది." - శ్రీలత, వరంగల్ రీజినల్ మేనేజర్
TSRTC Free Bus Service Women in Telangana :నూతన ప్రభుత్వం కొలువు తీరగానే ప్రారంభించిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme in Telangana)ఎంతో ప్రయోజనకరమని మహిళలు అంటున్నారు. తమ లాంటి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కళాశాలలకు వెళ్లేందుకు బస్‌పాస్ కోసం ఆన్‌లైన్ సెంటర్‌లో అప్లికేషన్ పెట్టుకొని, రోజుల తరబడి వేచి చూసేవాళ్లమని, ఇప్పుడు ఇబ్బంది లేకుండా పోయిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.