hindi paper leakage case: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం హిందీ పేపర్ లీకేజీ. వరంగల్ జిల్లాలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ పేపరు బయటకు రావడం పెను దుమారానికి దారితీసింది. ఈ కేసులో శనివారం మరో ఇద్దరికి పోలీసులు నోటీసులు పంపించారు. హిందీ పేపర్‌ను వాట్సప్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్రూప్‌లకు అడ్మిన్లుగా ఉన్న ఇద్దరికి పోలీసులు నిన్న నోటీసులు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ లీకేజీ వ్యవహారంపై ఇప్పటికే 25 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు అనుమానం ఉన్న మరికొద్ది మందికి సైతం పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదే విషయంలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు జర్నలిస్టులకూ నోటీసులు జారీ చేశారు పోలీసులు.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో నేడు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. లీకైన హిందీ పరీక్షా పత్రం 149 మందికి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరందరినీ విచారించే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య సంజయ్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.