వరంగల్ అర్బన్ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మే మొదటి వారం ఉష్ణోగ్రతలు కొంత తక్కువగా నమోదయ్యాయి. గత సంవత్సరం మే మొదటి వారంలోనే ఎండ 42 డిగ్రీలు దాటింది. ఈ ఏడాది 41 వరకే నమోదై కొద్దిగా తగ్గు ముఖం పట్టిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఎండలు బాబోయ్.. ఎండలు! - high temperature in kazipet
ఒక వైపు ఎండ తీవ్రత, మరోవైపు లాక్‌డౌన్‌తో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజలు బయట కనిపిస్తున్నారు. అనంతరం ఎండ వేడిమితో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వారం రోజులుగా వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది.. సాయంత్రం వేళ కాస్త చల్లబడుతోంది.
దంచి కొడుతున్న ఎండలు
ఏటా వాహనాలు వెదజల్లే కాలుష్యం కారణంగా ఎండ తీవ్రత ఒక డిగ్రీ సెంటిగ్రేడు పెరిగేదని, లాక్ డౌన్ నేపథ్యంలో ఈసారి కొంత ఊరటనిచ్చిందని ‘నిట్’ వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని వారు వివరిస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల గాలిదుమారం వచ్చి మామిడి, బత్తాయి తదితర పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు.