వరంగల్ నగరం జలవిలయం నుంచి తెరుకోలేదు. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. హన్మకొండలోని పలు రోడ్లు, కాలనీలో నీటిలోనే ఉండి పోయాయి. ఇంకా కేయూ వంద ఫీట్ల రోడ్లో వరద ప్రవాహం బీభత్సంగా కొనసాగుతుంది. ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు ఆగిపోయాయి.
ఓరుగల్లు అతలాకుతలం.. ఇంకా జలదిగ్బంధంలోనే అనేక ప్రాంతాలు - వరంగల్లో వర్షాలు
వరుణుడి జోరు కొనసాగుతూనే ఉంది. వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. వందలాది కాలనీలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హన్మకొండలోని సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, హనుమాన్ నగర్, డీన్దయాల్ నగర్, పోచంకుంట... తదితర కాలనీలు వరద నీటిలోనే ఉండి పోయాయి. గత నాలుగు రోజుల నుంచి వరద నీటిలోనే ఉంది పోయామని బయటకు రావాలంటే భయమవుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాలు, కూరగాయలకు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రతి వర్షాకాలం ఈ విధంగానే ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వరద ప్రవాహం నుంచి కాపాడాలని కోరుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ల వద్దరు నీరు చేరడం, చెట్లు విరిగిపడినందున నగరంలో పలు ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.