ఓరుగల్లులో జోరు వానలు.. కూలిన పాత ఇళ్లు... - మేయర్ గుండా ప్రకాశ్
ఏకధాటిగా కురిసిన వర్షాలు ఓరుగల్లు వాసులను ముంచేశాయి. నాలుగు రోజులుగా పడుతున్న వానకు నగరంలోని పాత ఇళ్లు, ఆలయాలు, ప్రహరీ గోడలు నేలకూలాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. పదుల సంఖ్యలో ఇళ్లు నేల కూలాయి. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు వరంగల్ మహా నగర పాలక సంస్థ.. సహాయం చేస్తామని భరోసానిచ్చింది.
వరంగల్ వాసులకు వర్షాలు నష్టాలను మిగిల్చాయి. గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరంలో రహదారులు దెబ్బతిన్నాయి. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. అధిక వర్షాలకు కరీమాబాద్, ఉరుసు శివ నగర్, కాశిబుగ్గ గాంధీనగర్, రామన్నపేట, దేశాయిపేట, కిలా వరంగల్ లేబర్ కాలనీలో పదుల సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. రామన్నపేటలో మొహమ్మద్ షఫీ దంపతులు ఇంట్లో ఉండగానే ఇంటి పైకప్పు కూలడం వల్ల వృద్ధ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాంధీనగర్లో కరుణమ్మ ఇంట్లోని మొదటి గది పైకప్పు కూలింది. ఇంట్లోని టీవీ, నిత్యావసర వస్తువులతో పాటు ఫర్నిచర్ ధ్వంసం అయింది. కిలా వరంగల్ కోటలో స్వయంభు శివాలయం వెనుకభాగంలోని ప్రహరీ గోడ భక్తులు లేని సమయంలో నేల కూలడం వల్ల ప్రమాదం తప్పింది.
భారీగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన చెత్త, కాలనీలలో నిలిచిన వరద నీటిని తొలగించడం వంటి పనులు చేపట్టారు. ముందే చర్యలు చేపట్టడం వల్ల నష్టం భారీగా తగ్గిందని మేయర్ గుండా ప్రకాశ్ పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 900పైగా ఇళ్లు శిథిలావస్థకు చేరినట్లుగా ఆయన తెలిపారు. హన్మకొండలో శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇంటిలో ఉంటున్న ఓ వృద్ధురాలిని మేయర్ చేరదీశారు. పాత ఇళ్లను వదిలిపెట్టాలని నగరవాసులకు అధికారులు విన్నవించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఇవీ చూడండి: రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం