Heavy Rains in Telangana : ఏకధాటిగా కురిసిన వర్షం వరంగల్‌లోని లోతట్టు కాలనీలను జలమయం చేసింది. నగర వీధులన్నీ ఏరులుగా తలపించగా.. మోకాల్లోతు పైగా వచ్చిన వరదతో ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు వీడని ముసురుతో పలు కాలనీల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. సమీప నాలాలు పొంగి ప్రవహించాయి. ఎస్ఆర్నగర్, సాయిగణేష్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎంహెచ్నగర్, శివనగర్ కాలనీల్లోని ఇళ్లు చెరువయ్యాయి. బియ్యం, పప్పు, ఉప్పు, ఇతర సామగ్రి తడిసిపోవటంతో.. బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. వర్షపునీటిలో చిక్కుకున్న వివేకానందకాలనీ, సుందరయ్యనగర్, సాయిగణేశ్ కాలనీల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్న మంత్రి.. పునరావాసానికి తరలించాలని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి.. రెస్క్యూటీం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు.
గ్రామాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం : వరంగల్ల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాగులు వంకలూ ఉప్పొంగుతుండగా.. జిల్లాలోని చెరువులు అలుగులు పారుతున్నాయి. భారీ వర్షంతో పంథిని వద్ద ఊర వాగు ఉప్పొంగడంతో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపైకి ఆరడగుల మేర వరద నీరు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడిగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట శివారులో ఆకేరు వాగు ఉథృతంగా ప్రవహించగా.. రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని లోతట్లు ప్రాంతాలు జలమయంగా మారాయి. గత రాత్రి నుంచి వర్షం కురవడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేట మండలం ఇల్లందలో తరచూ వరదనీరుతో ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు.
Heavy Rains in Narsampeta : నర్సంపేట మండలంలోని మాధన్నపేట చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తుంది. నెక్కొండ మండలంలో వట్టెవాగు పొంగిపొర్లుతుండడంతో నెక్కొండ, పత్తిపాక.. నెక్కొండ, గుండ్లపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల వాగు పొంగి పొర్లుతుండడంతో నెక్కొండ, గూడూరు మండలాలకు సంబంధాలు తెగిపోయాయి. చెన్నారావుపేట మండలంలో ముగ్ధంపురం చెరువు పొంగడంతో నర్సంపేట- చెన్నారావుపేట రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్ వే మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహించటంతో నర్సంపేట చెన్నారావుపేట, నెక్కొండ మీదుగా అన్నారం, తొర్రూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట మండలం గురిజాల పెద్దచెరువు ప్రమాదకర స్థాయిలో మత్తడి పోస్తుండడంతో నర్సంపేట నుంచి గురిజాల మీదుగా పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురిజాల పెద్ద చెరువు సమీపంలోని లోలెవల్ కాజ్‌వే వద్ద ఉన్న తాడిచెట్టు విద్యుత్ తీగలపై విరిగి పడడంతో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు స్తంభాలు నేలకూలాయి. స్థానికుల అప్రమత్తంతో ప్రమాదం తప్పింది.
Warangal Rains : ఊరు ఏరయ్యింది.. ఏరు హోరెత్తింది.. వాగూవంకా ఏకం చేస్తూ ఉప్పొంగింది