తెలంగాణ

telangana

ETV Bharat / state

Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Rains in Telangana, rains in state
తెలంగాణలో వర్షం, జోరు వానలు

By

Published : Jul 11, 2021, 12:13 PM IST

Updated : Jul 11, 2021, 4:58 PM IST

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వాన కురుస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తొలకరి జల్లులతో చెరువులు, కుంటలు నిండుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జలమయం

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తూలోనిగుట్ట చెరువుకు వరద పోటెత్తింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి బొమ్మసముద్రం చెరువు నిండింది. ఈ క్రమంలో తూలోనిగుట్ట చెరువులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తూలోనిగుట్టలో పలు ఇళ్లు, పంట పొలాలు జలమయం అయ్యాయి. ఊరిలోకి నీరు చేరిందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

వరంగల్​లో జోరు వాన

వరంగల్‌ నగరంలో వర్షం జోరుగా కురిసింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్‌ నగరంలోని తదితర ప్రాంతాలలో కుండపోతగా వాన పడింది. జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మురికి కాలువలు పొంగాయి. రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. రోడ్ల పక్కన ఉన్న దుకాణంలోకి వరద నీరు చేరింది. వర్షం కురిసినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రహదారులు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

అటు వరంగల్ గ్రామీణ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు గ్రామాల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం 7 గంటలనుంచి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. వర్ధన్నపేట బస్టాండ్​లోకి వర్షపు నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

జోరువాన

నిండుకుండలా నల్లవాగు

ఏకధాటిగా కురుస్తున్న వానతో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని సాగునీటి ప్రాజెక్టు నల్లవాగు నిండుకుండలా మారింది. ఆదివారం ఉదయం అలుగు పారుతోంది. 5,300 ఎకరాలకు సాగు నీరు అందించగల సామర్థ్యం ఈ చెరువుకు ఉంది. తొలకరి జల్లులకు ప్రాజెక్ట్ నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అలుగు పోస్తున్న నల్లవాగు

మఠంపల్లికి పులిచింతల ముంపు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం రక్షణ గోడ చుట్టూ పులిచింతల బ్యాక్ వాటర్ చేరింది. గోడ లీకులు కావడంతో ఆలయ ప్రాంగణంలోకి వరద చేరుతోంది. పులిచింతల ప్రాజెక్ట్​లో 40 టీఎంసీల నీరు చేరితే మట్టపల్లి శ్రీలక్మి నరసింహ స్వామి ఆలయం ముంపునకు గురవుతుంది. మూడు మోటర్ల సాయంతో నీటిని తోడుతున్నారు.

ఎడతెరిపిలేని వాన

పొంగిపొర్లుతున్న వాగులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటి వానతో హుస్నాబాద్ పట్టణంలోని పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతున్నందున రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి, కామేపల్లిల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇల్లందులో 19.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో బొగ్గు ఉత్పత్తికి పనులకు అంతరాయం ఏర్పడింది.

మూడు రోజులు వర్షాలే..

కోస్తా-ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి మధ్య ట్రోపోస్పీయర్ వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలదీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లో విస్తారంగా వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

రాష్ట్రంలో జోరువాన

ఇదీ చదవండి:HEAVY RAIN: హైదరాబాద్​లో పలు చోట్ల ఏకధాటిగా కురిసిన వర్షం

Last Updated : Jul 11, 2021, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details