తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా గ‌త నాలుగు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెరువులు, కుంట‌లు అలుగు బారుతున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు ముంపునకు గుర‌వుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు నీటి కోత‌కు గుర‌య్యి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం హై అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

Heavy rains across the joint district .. Vigilant authorities
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు

By

Published : Aug 16, 2020, 2:25 PM IST

గత నాలుగు రోజులుగా ఉమ్మడి వరంగల్​ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన నివాసం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మ‌రో 3 రోజుల పాటు వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగే అవ‌కాశం ఉన్నందున.. రానున్న రోజుల్లో చేప‌ట్ట‌బోయే కార్యాచ‌ర‌ణ‌పై దిశానిర్దేశం చేశార‌ు.

వ‌రంగ‌ల్ జిల్లాలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించామ‌ని మంత్రి పేర్కొన్నారు. గోదావ‌రి తీర ప్రాంతం అప్ర‌మ‌త్తం చేశామ‌న్నారు. వ‌రంగ‌ల్​కు జాతీయ విపత్తుల నివార‌ణ టీమ్​లను ర‌ప్పిస్తున్నామ‌ని చెప్పారు. ఎమ‌ర్జెన్సీ అవ‌స‌రాల‌కు సిద్ధంగా లైఫ్ జాకెట్లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. ఉమ్మ‌డి జిల్లాలోని అన్ని ర‌కాల ర‌వాణా మార్గాలను మూసి వేసే దిశ‌గా ఆలోచిస్తున్నామ‌ని స్పష్టం చేశారు.

మ‌రోవైపు ప్ర‌జ‌లెవ‌రూ ఇళ్ల విడిచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని, వ్య‌వ‌సాయ ప‌నులు, చేప‌ల కోసం రైతులు, జాల‌ర్లు వెళ్లొద్దని హెచ్చరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని క‌లెక్ట‌రేట్ల‌లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, టోల్ ఫ్రీ నెంబ‌ర్లు పెట్టామ‌న్నారు. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్​లో అద‌నంగా కంట్రోల్ రూములుంటాయ‌ని స్పష్టం చేశారు.

వర్షాల తీవ్ర‌త త‌గ్గే వ‌ర‌కు మంత్రుల‌ు, ఎమ్మెల్యేలు ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో వారే ఉండి.. స‌మీక్ష‌లు నిర్వహించాలని సూచించారు. తాను వ‌రంగల్, మంత్రి స‌త్య‌వ‌తి రాఠోడ్ మ‌హ‌బూబాబాద్ కేంద్రంగా అన్నివేళలా అందుబాటులో ఉంటామ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని, త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఉండాల‌న్నారు. స‌మ‌స్య‌లుంటే వెంట‌నే కంట్రోల్ రూమ్​ల‌లోని టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌కు ఫోన్​లు చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. జిల్లా క‌లెక్ట‌ర్లు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మ‌న్వ‌యం చేస్తుండాలని తెలిపారు.

కలెక్టర్​ సమీక్ష..

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్​ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ట్రాన్స్​కో , మున్సిపాలిటీ శాఖ అధికారులతో హన్మకొండలోని కలెక్టరేట్​లో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. ఆస్తి, ప్రాణ, పశు నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్రాఫిక్​కు అంతరాయం

వర్షం కారణంగా వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్ర శివారులో ఖమ్మం-వరంగల్ రహదారిపై వర్షపు నీరు భారీగా ప్రవహించడంతో రోడ్డుకు మధ్యలో గొయ్యి ఏర్పడింది. అది గమనించని ఓ లారీ​.. అందులో పడిపోయింది. ఫలితంగా 3 గంటల పాటు రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 4 కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సేవలో భాగంగా ఓ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను తరలిస్తున్న అంబులెన్స్ సైతం ట్రాఫిక్​లో చిక్కుకుంది. చివరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. లక్నవరం సరస్సు నిండుకుండలా మారి 2.5 ఫీట్ల ఎత్తుతో మత్తడి పోస్తోంది. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల దెయ్యాల వాగు పొంగి పొర్లుతూ గోవిందరావుపేట మండల కేంద్రంలో పలు ఇళ్లు నీట మునిగాయి.

వెంకటాపురం మండలం పాలెం వాగు ప్రాజెక్టుకు నీటి ఉద్ధృతి పెరగడం వల్ల నీటిపారుదల శాఖ అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని గోదావరికి మళ్లిస్తున్నారు. ఫలితంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే గోదావరి వరద ఉద్ధృతి పెరగడం వల్ల.. ముందు జాగ్రత్తగా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని నందమూరి నగర్, ఎస్సీ వాడ, ఓడగూడెం ప్రాంతాల ప్రజలను స్థానిక ఎమ్మెల్యే సీతక్క అప్రమత్తం చేశారు. ముంపునకు గురవుతున్న వారందరూ ఖాళీగా ఉన్న హాస్టళ్లకు వెళ్లాలని సూచించారు.

మహబూబాబాద్ జిల్లాలో

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం చెరువు మత్తడి పోస్తోంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా కంఠాయపాలెం, గుర్తురు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

జనగామలో..

జనగామ జిల్లా వ్యాప్తంగా కుంటలు, చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. జనగామ పట్టణ శివారులోని చిట్టకోడూరు జలాశయం పూర్తి స్థాయిలో నిండటం వల్ల డ్యామ్​ 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు నర్మెట్ట మండలంలోని గండి మల్లన్న జలాశయం సైతం నిండటం వల్ల 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్టేషన్ ఘన్​పూర్ జలాశయం నిండి మత్తడి పోస్తోంది.

ఇదీచూడండి: వర్షాలు, వరదలతో మరింత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుతం

ABOUT THE AUTHOR

...view details