ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఓరుగల్లు నగరం తడిసి ముద్దయింది నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అండర్ డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో రోడ్డుపై వరద నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
ప్రధానంగా పోచమ్మ మైదాన్ కూడలి నుంచి వరంగల్ చౌరస్తా, స్టేషన్ రోడ్డు జలమయమయింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
తడిసి ముద్దైన నగరం
వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. ఉదయం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వానతో... రహదారులు, లోతట్టు కాలనీలు జలమయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. హన్మకొండలోని పలు కాలనీల్లో మోకాలోతు నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మురికి కాలువలు పొంగిపొర్లాయి.
ఈదురు గాలులతో వర్షం
వరంగల్ గ్రామీణ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో వర్ధన్నపేట, రాయపర్తి, సంగెo, పర్వతగిరి, ఐనవోలులో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేట బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరి.... వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నర్సంపేట, పరకాలలోనూ భారీ వాన కురుస్తోంది.
ఇదీ చదవండి:Rains in Telangana: రాష్ట్రంలో జోరు వాన.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు