Water scarcity in Hanumakonda : హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్‌లోని పలు గ్రామాలకు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధాన కాలువలో ఎస్సారెస్పీ నీరు నిండుగా ప్రవహిస్తున్నా.. చివరి ఆయకట్టు రైతులకు సరైన స్థాయిలో నీరు అందక పంట పొలాలు బీటలు వారుతున్నాయి. ఎగువన ఉన్న రైతులు.. ఎస్సారెస్పీ కాలువల్లో అడ్డుకట్ట వేసి ఇష్టారాజ్యంగా విద్యుత్ మోటార్లు బిగించడంతో దిగువన రైతుల పంట పొలాలు ఎండిపోయి నీటి కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
''ఎస్సారెస్పీ కాలువ నీరు అందుతుందనే నమ్మకంతో ఎకరం విస్తీర్ణంలో వరి పంట వేశాను. ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటిని ఎగువ ప్రాంతాల్లో ఉన్న వారు మోటార్లు పెట్టి లాగేసుకుంటుండటంతో పిల్ల కాలువలకు నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకుంటే పంటలు పశువుల మేతకు తప్ప దేనికీ పనికిరాకుండా పోతాయి.'' - రైతు
వేలాది రూపాయలు అప్పులు చేసి పంటకు పెట్టుబడి పెట్టినా.. నీరు అందకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి రైతుల్లో నెలకొంది. సంబంధిత అధికారులు నీటిని విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారని.. క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదంటూ అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దిగువలో ఉన్న రైతులకు.. ఎస్సారెస్పీ నీటిని పూర్తి స్థాయిలో అందేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే.. మరోవైపు పంట చేలకు కాల్వల ద్వారా నీరందక, విద్యుత్ చక్కగా లేక మోటార్లు పని చేయని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.