హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పీవీ స్వగ్రామం వంగర రైతులు ధర్నా(farmers protest today) చేపట్టారు. వంగర గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడానికి 575, 576, 583, 595 సర్వే నంబర్ల నుంచి ప్రభుత్వం సుమారు 280 ఎకరాలకు పైగా తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆందోళనలో సుమారు 80 మంది రైతులు పాల్గొన్నారు. 1965లో వంగరలో పీవీ భూమిలో కొంత భూమిని దళితులు, పేదలకు ఇచ్చారని గ్రామస్థులు గుర్తు చేశారు. రాళ్లురప్పలూ ఉన్నటువంటి ఆ భూములను సేద్యానికి అనుకూలంగా చేసుకుని... జీవనం సాగిస్తున్నామని వారు తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ జీవనాధారం అయిన ఆ భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పేరిట లాక్కోవడానికి ప్రయత్నించడం దారుణమని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పి... ఉన్న భూములను ఆక్రమించుకోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే... ఈ తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆమరణ నిరాహార దీక్షకు(farmers protest today) సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.