Conflicts between two groups in Hanamkonda: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే వరంగల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం తోపులాటలకు దిగి.. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. వచ్చే నెల 6న రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు రేవంత్ బృందం వెళ్లింది.
ఓవైపు రేవంత్ బృందం సభ ఏర్పాట్లు పరిశీలిస్తుండగానే.. రెండు వర్గీయుల మధ్య గలాటా చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి ముందు బలప్రదర్శనకు దిగడంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హనుమకొండ పార్టీ టికెట్‌ను నాయని రాజేందర్ రెడ్డి ఎప్పట్నుంచో ఆశిస్తుంటే.. ఇటీవలే తాను కూడా రేసులో ఉన్నట్లు జంగా రాఘవరెడ్డి చెప్పడంతో వివాదం మొదలైంది. ఇది కాస్తా పార్టీ అధినేత ముందే... ఘర్షణకు దారితీసింది. గత కొన్ని రోజులుగా జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు బహిర్గతమయ్యాయి.