తెలంగాణ

telangana

ETV Bharat / state

వేరుశనగ రైతుల్లో ఆనందం.. ఆవేదన! - వర్షాల వల్ల సగం దిగుబడి తగ్గిందని రైతుల గోడు

పల్లి రైతులకు కొంత మేర ఊరట లభిస్తోంది. వర్షాలకు దిగుబడి తగ్గినా మంచి ధర పలుకుతోంది. ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్ధాయిలో క్వింటాకు 7వేల 350 రూపాయల ధర దక్కింది. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు... ముందు ముందు ఇదే ధర వచ్చేలా చూడాలని మార్కెట్‌ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

వేరుశనగ రైతులకు ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆవేదన
వేరుశనగ రైతులకు ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆవేదన

By

Published : Jan 23, 2021, 7:06 PM IST

ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్థాయిలో పల్లి ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు పల్లి రాక క్రమంగా అధికమైంది. జిల్లాల్లోని నలుమూలల నుంచి రోజుకు 8 వందల బస్తాలమేర పల్లిని రైతులు తరలిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ధర అధికంగా దక్కుతోంది. క్వింటాకు 7వేల350 రూపాయల వరకు పలుకుతోంది. మంచి ధర వస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధర ఎక్కువ ఉన్నా దిగుబడి విషయంలో ఈసారి అధికవర్షాలు... పల్లి రైతును నష్టాలపాలు చేశాయి. దిగుబడి సగానికి తగ్గిపోయింది. ఎకరానికి 40 బస్తాలు రావాల్సిన చోట...20 రావడం గగనంగా మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల నాణ్యత సైతం దెబ్బతిన్నదని వాపోతున్నారు.

పల్లి నాణ్యతను బట్టే ధర నిర్ణయం జరుగుతోందని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. నెంబర్ వన్ రకంతో పోలిస్తే... మిగతా వాటికి కొంచెం ధర తక్కువ రావడం సహజమేన పేర్కొంటున్నారు.. పల్లి రైతులందరికీ మంచి ధర వచ్చేలా వ్యాపారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. మట్టి, తేమ లేకుండా పల్లికాయ తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇతర ప్రాంతాల నుంచి మరింత ఎక్కువగా పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. ధర తగ్గకుండా చూస్తేనే... రైతులకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే దిగుబడి తగ్గిపోయిన తరుణంలో అన్నదాతలు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.

ABOUT THE AUTHOR

...view details