Greenfield National Highway land issue : హనుమకొండ జిల్లాలోని కొన్ని గ్రామాల మీదుగా విజయవాడ-నాగ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే వెళ్తుంది. భూసేకరణకు అధికారులు సర్వే చేపట్టారు. తమ అనుమతి లేకుండానే ప్రక్రియ కొనసాగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. హైవేకు భూములిచ్చేది లేదంటూ కొద్దిరోజులుగా నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. మూడు పంటలు పండే సాగు భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోట్లు విలువచేసే పొలాలు ఇచ్చేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్వే ప్రారంభమైనప్పటి నుంచి కర్షకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సర్వేలు కొనసాగిస్తూనే ఉన్నారు. దామెర మండలం ఊరుగొండ వద్ద 163వ జాతీయ రహదారిపై బైఠాయించి.. భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పట్లో కాస్త వెనక్కి తగ్గిన యంత్రాంగం... మళ్లీ తాజాగా గుట్టుచప్పుడు కాకుండా డ్రోన్ సాయంతో సర్వే చేపట్టింది. కడుపుమండిన అన్నదాతలు డ్రోన్ సర్వేను అడ్డుకున్నారు.