Greenfield Highway Project Issue : విజయవాడ నుంచి నాగపూర్ వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలో(Greenfield National Highway) భూములు కోల్పోతున్న భూ నిర్వాసిత రైతులు గత కొద్ది సంవత్సరాలుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రెవిన్యూ డివిజన్లో భూములు కోల్పోతున్న పలు గ్రామాలకు చెందిన రైతులు పరకాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రక్రియ ప్రారంభం నుంచి రైతులు రహదారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయిన తమ గోడును పట్టించుకోకుండా నేషనల్ హైవే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ప్రతిరోజు పొలంలో అనేక కష్టాలు పడుతుంటాం. ఆకలి దప్పికలు లెక్కచేయకుండా భూమిని నమ్ముకొని జీవిస్తూ ఉన్న మా భూములను హైవే పేరిట అన్యక్రాంతం చేస్తున్నారు. రైతే రాజు అంటున్న ప్రభుత్వాలు ఇలా పేదల భూములను లాక్కుంటూ మాకు కన్నీరే మిగులుస్తున్నాయి. నేషనల్ హైవే కోసం 8 వేల ఎకరాలు లాక్కున్నారు. విజయవాడ నుంచి నాగపూర్ వరకు నేషనల్ హైవే కొత్త మార్గం నిర్మించరాదని పోరాటం చేస్తున్నాం. పంటలు పండించే భూముల్లో భవనాలు, రోడ్లు నిర్మిస్తూ పోతే పంటలు ఎలా పండించాలి."- భూ నిర్వాసితుడు
Green Field National Highway: 'గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు భూములను ఇచ్చేదేలేదు'
Hanamkonda Farmers Protest Greenfield Project : పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు దిల్లీలోని పెద్దలకు కలిసి తమ గోడు విన్నవించుకున్న ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. న్యాయబద్ధంగా పోరాడేందుకు కోర్టులో కేసు వేశామని అయినప్పటికీ హైవే అధికారులు అవేమి పట్టనట్టు భూమికి పరిహారం ఇస్తామంటూ చెపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేది ఏమిలేక పురుగుల మందు డబ్బాలతో ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.