తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ పురపోరు: ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్​ వరంగల్​ ఎన్నికలు - telangana varthalu

స్వల్ప ఘటనలు మినహా వరంగల్ నగరపాలక సంస్థ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరోనా భయం, ఎండతీవ్రతతో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే బాగా తగ్గింది. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు మధ్యాహ్నానికి పలుచబడ్డారు. సాయంత్రం కూడా పెద్దగా ఓటింగ్ కేంద్రాల వైపు చూడకపోవడంతో.....49. 25 శాతమే నమోదైంది.

greater warangal elections
మినీ పురపోరు: ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్​ వరంగల్​ ఎన్నికలు

By

Published : Apr 30, 2021, 9:43 PM IST

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ చెదురుమదురు ఘటనల నడుమ ప్రశాంతంగా ముగిసింది. కరోనా కారణంగా నగర ఓటర్లు ఓటింగ్​పై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల 11 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్ల రాక తగ్గుముఖం పట్టింది. ఉదయం మాత్రం వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కర్ర సాయంతో కొందరు.. వీల్ ఛైర్లలో మరికొందరు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు తమ హక్కుని ఎలాంటి పరిస్థితుల్లోనైనా వినియోగించుకోవాల్సిందేనని ముక్తకంఠంతో చెప్పారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఇటు అర్బన్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాశ్​, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య, కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, పట్టణ గ్రామీణ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, హరిత తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

స్వల్ప ఘర్షణల మధ్య..

వరంగల్ ప్రాంతంలోని పలు డివిజన్లలో తెరాస, భాజపా, శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. 34వ డివిజన్​లోని పోలింగ్ కేంద్రం వద్ద కాషాయ చొక్కా ధరించి తిరుగుతున్న భాజపా కార్యకర్తను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇతర నేతలు అడ్డుకుని విప్పించడంతో గొడవ తలెత్తింది. పోలీసులు తెరాస నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ భాజపా నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. గీసుకొండ మండలం 16వ డివిజన్​లోనూ భాజపా కార్యకర్త వేసుకున్న కాషాయ చొక్కాను పోలీసులు విప్పించారు. 25వ డివిజన్ వద్ద... స్వతంత్ర అభ్యర్ధి అనుచరులు, తెరాస కార్యకర్తలకు మధ్య తలెత్తిన వివాదం పరస్పర ఘర్షణలకు దారి తీసింది. ఒకరికి స్వల్పంగా గాయాలు కావడం వల్ల పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పాటు పలు చోట్ల భాజపా, తెరాస కార్యకర్తలు మధ్య ఘర్షణలు చెలరేగాయి.

మే 3న లెక్కింపు

పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా నమోదైన ఓటింగ్ శాతం మాత్రం ...అందరినీ నిరాశకు గురి చేసింది. ఇది ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలమన్న లెక్కల్లో నేతలు మునిగిపోతే... మే 3న జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ మేయర్ పీఠం ఎవరికి దక్కేదన్నది ఓటర్లు ఇచ్చిన తీర్పు, బ్యాలెట్ పెట్టెల్లో భద్రంగా నిక్షిప్తమైతే.. ఈ తీర్పు ఏమిటో వెల్లడి కావాలంటే మాత్రం ...మే 3 వరకూ ఆగాల్సిందే.

ఇదీ చదవండి:ప్రశాంతంగా ముగిసిన మినీపురపోరు

ABOUT THE AUTHOR

...view details