రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మంగళవారం 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ దాటింది. అత్యధికంగా కుమురంభీం జిల్లాలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు మూడు రోజుల్లో ఎండలు పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ... కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీలు నమోదు కావొచ్చని తెలిపింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
వరంగల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా 42 డిగ్రీల మేర ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. వరంగల్ అర్బన్, గ్రామీణ, జనగామ, ములుగు జిలాల్లో 41 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే గ్రీష్మతాపం మొదలవుతోంది. ఎండవేడిమికి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్ధితుల్లో వచ్చినవారు గొడుగులు, తలకు గుడ్డలు కట్టుకుని బయటకు వస్తున్నారు. ద్విచక్రవాహనదారులు కూడా ఎండవేడిమితో పలు ఇక్కట్లు పడుతున్నారు. శీతలపానీయాలు, కొబ్బరినీళ్లు తాగి... ఎండతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ మధ్యాహ్నానికి నిర్మానుష్యంగా మారుతున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: పైపు బోల్టులు పీకేసిన రైతులు... లీక్ అయిన భగీరథ నీరు