వరంగల్ ఓఆర్ఆర్ కోసం భూ సేకరణ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం కుడా వీసీని ఆదేశించింది. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం వరంగల్ నగరం చుట్టూ 41 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా భూమి కోసం 28 గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తూ.. ఏప్రిల్ 30న కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ... ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తా రోకోలు, హైవేల దిగ్బంధం చేశారు. రెండు పంటలు పండే తమ భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఔటర్ రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు.
హైదరాబాద్‌లో సోమవారం మంత్రి కేటీఆర్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కలిశారు. భూ సమీకరణ నోటిఫికేషన్‌తో రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆందోళనలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 'కుడా' పరిధిలో భూ సమీకరణ విధానాన్ని రద్దు చేయాలని మంత్రి కేటీఆర్.. సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కోరారు.