Godawari Banks are washed away Due to Rains : ఏటూరునాగారం- మంగపేట మధ్య ఉన్న గోదావరి కరకట్ట గతేడాది జులైలో వచ్చిన భారీ వరదలకు అనేకచోట్ల ఇలా కోతకు గురైంది. రొయ్యూరు సమీపంలో కట్ట నిలువునా కోతకు గురైంది. ఇక్కడ గోదావరి వంపు తిరుగుతుండటంతో నీళ్లు సుడులు తిరిగి కరకట్ట దెబ్బతింటోంది. కొంచెం కొంచెం కోస్తూ గతేడాది భారీగా దెబ్బతీసింది. కొన్నిచోట్ల పది మీటర్లలోపే వెడల్పు మిగిలింది. ఈ కట్ట కోతకు గురైందంటే ఏటూరునాగారం, మంగపేట పట్టణాలకు కూడా ముప్పు తప్పదని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణ మరమ్మతులు కింద తాత్కాలిక పనులు చేపడుతున్నారని.. శాశ్వత పరిష్కారం కరవైందని వాపోతున్నారు.
మరమ్మతుల నిధులకై స్పష్టత లేదు : గతేడాది జులై 15న గోదావరికి వచ్చిన భారీ వరదలు ఏటూరు నాగారం పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. పది రోజుల పాటు వరద పెద్దఎత్తున ప్రవహించింది. నిర్మల్, మంచిర్యాల జిల్లా ఇద్దరణల్లోనూ పరీవాహకంలో ముంపు ఏర్పడింది. భద్రాచలం, బూర్గంపాడు. మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో గ్రామాలు మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న పొలాలు, చెలకలు కోతకు గురయ్యాయి. వీటన్నింటిపై నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సర్వేలు నిర్వ హించాయి. నది ముంపుపై నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత మరమ్మతులకు సంబంధించిన ప్రణాళిక, నిధులు విడుదలపై స్పష్టత రాలేదు.
గుత్తేదారు పనులు పూర్తి స్థాయిలో కాలేదు :ఏటూరునాగారం-మంగపేట మండలాల్లో గోదావరికి మలుపులు ఉన్నాయి. దీంతో ప్రవాహం ఒకవైపు చొచ్చుకుని వస్తోంది. దీంతో 1990లో తీర ప్రాంతాల రక్షణకు 10.64 కిలోమీటర్ల పొడవుతో కట్ట నిర్మించారు. గతేడాది ఇది చాలా చోట్ల కోతపడింది. 5.9 కిలోమీటర్ల నుంచి 6.9 కిలోమీటర్ల మధ్య పాడయింది. అక్కడి నుంచి 7.7 కిలోమీటర్ల మధ్య కూడా లోపలి భాగం మట్టి కొట్టుకు పోయింది. రివిట్మెంట్ కనిపించకుండా పోయింది. వాస్తవానికి ఈ కట్ట శాశ్వత స్థాయిలో మరమ్మతులకు ఉమ్మడి రాష్ట్రంలోనే టెండర్లు పిలిచినా గుత్తేదారు పనులు పూర్తి స్థాయిలో చేయలేదు.