వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ పంచాయితీ ప్రజలు లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు తమ వంతు సాయంగా వినూత్న కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రతి ఒక్కరికి 12 కిలోల ఉచిత రేషన్ బియ్యంలో కొంత భాగం పేదలకు పంచుతున్నారు. ఇందుకు గానూ.. బియ్యం తీసుకోగానే.. అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక డబ్బాలో తమ వంతుగా కొన్ని బియ్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు భీమదేవరపల్లి మండల ప్రజలు 108 కిలోల బియ్యం ఇచ్చ్టారు. రెండో విడత బియ్యం పంపిణీలో భాగంగా మరిన్ని బియ్యం ఇవ్వనున్నారు. ఈ బియ్యాన్ని రేషన్ కార్డు లేని పేదలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ అందించారు.
రేషన్ కార్డు లేని పేదల కడుపు నింపే ఆలోచనకు.. స్పందన! - వరంగల్ జిల్లా వార్తలు
సాయం చేయాలన్న ఆలోచన ఉంటే.. ఉపాయం అదే వస్తుంది. లాక్డౌన్ సమయంలో పేదలకు తమ వంతుగా సాయం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ పంచాయితీకి చెందిన ప్రజలు తమకు వచ్చే రేషన్ బియ్యంలో కొంతభాగం పేదలకు పంచుతున్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆలోచన మేరకు ఈ వినూత్న కార్యక్రమం అమలు చేస్తున్నారు.
హుస్నాబాద్ నియోజక వర్గంలోని 9వేల మందికి నిరుపేదలకు బియ్యం పంచనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. తమకు వచ్చిన రేషన్ బియ్యంలో నిరుపేదలకు పంచడానికి తమవంతు సాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేసిన ఆలోచనకు మంచి స్పందన వస్తున్నది. రేషన్ కార్డు లేకపోయినా.. ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం ఈ విధంగా అందినందుకు బియ్యం అందుకున్న పేదలు ఎమ్మెల్యేకు, భీమదేవరపల్లి మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'