పచ్చదనం పెంపు, అడవుల పునరుద్ధరణపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అటవీశాఖ అధికారులు తమ కార్యాచరణ ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన పీసీసీఎఫ్ శోభ... వరంగల్, కరీంనగర్ అటవీ సర్కిళ్ల పరిధిలోని అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పల్లె ప్రగతి, హరితహారం, అటవీ రక్షణ, పునరుజ్జీవన చర్యలపై చర్చించారు. ఇటీవలే ఉద్యోగంలో చేరిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ఉన్నతాధికారులు మార్గనిర్దేశం చేశారు.
అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి...
అటవీ శాఖ పరిధిలో ఉన్న నర్సరీల్లో పెద్ద మొక్కలు పెంచాలని, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట అవెన్యూ ప్లాంటేషన్ మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్ శోభ సూచించారు. అటవీ ప్రాంతాల రక్షణలో భాగంగా కందకాలు తవ్వటం, సహజ సిద్ధంగా అటవీ పునరుద్ధరణ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుజ్జీవనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
అటవీ భూముల ఆక్రమణ, కలప అక్రమరవాణాను పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని... ఈ విషయంలో అధికారులు, సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని శోభ హెచ్చరించారు. ఏక్కడైనా సమస్యలు వస్తే కలెక్టర్లను సంప్రదించాలని... పోలీసు, రెవెన్యూ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. వేసవిలో మొక్కలకు నీటి సరఫరా ఏర్పాట్లతో పాటు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ విషయమై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పట్టణాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని పీసీసీఎఫ్ శోభ స్పష్టం చేశారు.
'సహజ సిద్ధంగా అటవీ పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలి' ఇవీ చూడండి:'పంచాయతీరాజ్ సమ్మేళనాలు 25లోగా పూర్తిచేయాలి'