ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగే కాదు.. పూలతో మాత్రమే జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ. తంగేడు, గుమ్మడి, గునుగు, బంతి, కట్ల, బీర, ఇలా తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చడంలో రాష్ట్రంలోని మహిళలకు సాటి, పోటి మరొకరు లేరు. ఉదయం అంతా పూల సేకరణలో నిమగ్నమైనా... దానిని శ్రమ అనుకోరు. మధ్యాహ్నం అంతా బతుకమ్మను తయారు చేయడంలో గడిపేసినా.. అది ఇబ్బందిగా భావించరు. రాత్రి వరకూ ఆటపాటలతో గడపినా వారికి అలసటే రాదు. అదే బతుకమ్మ పండుగ ప్రత్యేకత.
బతుకమ్మ కోసమే విరబూస్తున్నట్లుగా... కట్టిపడేస్తున్నాయ్ - flowers in batukamma season
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నేటి నుంచి ప్రారంభమవుతోంది. బతుకమ్మ పండుగ కోసమే తాము ఉన్నాము అన్నట్లుగా పూలన్నీ విరబూస్తూ ఆకట్టుకుంటున్నాయి. కొమ్మలనిండా విరిబూసిన పుష్పాలు.. చూపరులను కనువిందు చేస్తున్నాయి.
బతుకమ్మ కోసమే విరబూస్తున్నట్లుగా... కట్టిపడేస్తున్నాయ్
సంవత్సరమంతా ఈ పండుగ కోసమే ఆడబిడ్డలు ఎదురుచూస్తారు. పుట్టింట్లో కొందరు... అత్తారింట్లో మరికొందరు... ఎవరి వీలును బట్టి వారు ఈ పండుగను సంతోషంగా జరుపుతారు. కష్టం, సుఖం, భక్తి, భయం, ప్రేమ, బంధుత్వం, చరిత్ర, పురాణాలు కలగలిపి పాడే పాటలు... ఈ పండుగ రోజుల్లో వీధి వీధినా మార్మోగుతాయి. ప్రస్తుతం కరోనా వైరస్... పండుగ సందడిని తగ్గించింది.