Warangal Floods Latest News : వరద మహోగ్రరూపం నుంచి ఓరుగల్లు మహానగరం ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. వరుణుడు తెరిపినివ్వడంతో ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు జరిగిన నష్టం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ఇళ్ల నుంచి వెళ్లిన వారు.. తిరిగి వచ్చి బురదతో నిండిపోయిన ఆవాసాలను చూసి ఆవేదన చెందుతున్నారు. బొంది వాగు వరద నీరు కారణంగా.. సంతోషిమాత నగర్, గణేశ్ నగర్, ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్, రాజీవ్ నగర్, బృందావన్ కాలనీలు జల దిగ్భందంలోనే ఉన్నాయి. హనుమకొండలో పలు కాలనీలు వరద నుంచి బయటపడగా.. ఇళ్లలోకి చేరిన బురదతో నగరవాసులు ఇక్కట్లు పడుతున్నారు. నాలాల నుంచి కొట్టుకొచ్చిన చెత్తా చెదారంతో వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇళ్లను బాగు చేసే పనిలో నగరవాసులు నిమగ్నమయ్యారు. ఏటికేడూ వరదలు ముంచెత్తుతున్నా.. అధికారులు తూతూ మంత్రం చర్యలతో సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Warangal Floods Problems : వరద ముంపు కారణంగా వరంగల్లోని పలు కాలనీల్లో పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. బీఆర్నగర్లో రెండు ఇళ్లు నేల కూలగా.. సంతోషిమాత నగర్లో మరో మూడిళ్లు వరద ధాటికి ధ్వంసమయ్యాయి. ఖిలా వరంగల్ లో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. వరదలు సృష్టించిన బీభత్సంతో సర్వం కోల్పోయామని.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మా ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోయాయి. బియ్యం, బట్టలు, టీవీలు, కూలర్లు, ఫ్రిజ్లు.. అన్నింటినీ బురద కప్పేసింది. ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదు. చుట్టుపక్కల ఉన్న ఎత్తైన భవనాలపైనే రోజులు వెళ్లదీస్తున్నాం. ప్రభుత్వం మాకు పరిహారం అందించి ఆదుకోవాలి. మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. - వరద బాధితులు