ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువుల్లో మత్స్యకారులు వేసిన చేప పిల్లలు పెరిగి పెద్దవయ్యాయి. వాటిని మే లోపే పూర్తిగా పట్టాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వర్షాకాలంలో చేతికి చిక్కకపోగా వరదలకు చెరువుల్లోనుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్యకారులకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
చేపల చెరువులు ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 రిజర్వాయర్లు, 750 మత్స్యశాఖ చెరువులు, 4350 గ్రామపంచాయతీ చెరువులు, కుంటలుండగా వీటలో చేపల పెంపకం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 750 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 150 మహిళా మత్స్య సహకార సంఘాలున్నాయి. చేపల పెంపకంపై 1.50 లక్షల మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఏటా రూ.850 కోట్ల విలువ చేసే చేప పిల్లల్ని చెరువుల్లో ఉచితంగా వేస్తోంది. చెరువుల్లో మొత్తం లక్ష టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి వేసవిలో 60 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా 40 శాతం స్థానికంగా విక్రయిస్తున్నారు.