Female Drum Artists In Karimnagar: పూర్వం ఆడవారిని వంట గదికే పరిమితం చేసేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ నారీ శక్తి అనేది విశ్వమంతా వ్యాపించింది. పురుషులతో పాటు మహిళలూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఏ రంగంలోనైనా సరే మహిళలు లేని చోటు అంటూ లేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశమే హద్దుగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు మహిళలు. మగ వారు చేసే పనులను తాము కూడా చేస్తామంటూ కరీంనగర్ జిల్లాలోని మహిళా డప్పు కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.
నాటి నుంచి నేటి వరకు పురుషులు మాత్రమే డప్పు వాయించే కళాకారులుగా పని చేస్తూ ఉండేవారు. ఈ రంగంలోకి మహిళల ప్రవేశం అరుదుగానే ఉంటుందని చెప్పాలి. కానీ ఇలాంటి రంగంపై పలువురు మహిళలు ఆసక్తి చూపిస్తూ.. దానిలో రాణిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సభలో మహిళా డప్పు కళాకారులు పాల్గొని డప్పుల దరువుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మూలంగూర్ గ్రామానికి చెందిన 20 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి.. డప్పు కళాకారులుగా పని చేస్తున్నారు. ఒక్కొక్క డప్పును రూ.1000 పెట్టి కొనుగోలు చేసి.. ఈ రంగంలో రాణిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు.. కూలీ పనుల నిమిత్తం బయట ఊళ్లు వెళుతూ ఉంటారు. పనులు లేని సమయంలో డప్పులు వాయించేందుకు వివిధ ప్రాంతాలకు వెళతారు.