తెల్ల బంగారంగా పిలిచే పత్తికి.. ఈసారి మార్కెట్లో మంచి ధర పలికింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గతంలో ఎప్పుడూ లేనంతగా.. క్వింటా రూ.14 వేల ధర పలికింది. మంచి ధర పలుకుతుండడంతో.. రైతులు ఈసారి పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా పత్తిసాగును ప్రోత్సహిస్తోంది. ఇక తామర పురుగుతో నష్టపోయిన మిర్చి రైతులు కూడా.. పత్తిసాగు వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈసారి ఉమ్మడి వరంగల్‌లో పత్తి సాగు విస్తీర్ణం పెరగనుంది. ఈ వానాకాలం సీజన్‌లో పత్తి పంట 7,84,500 ఎకరాల్లో సాగవుతుందని.. వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా విస్తారంగా వర్షాలు కురవకపోవడం.. రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. వర్షాలు పడిన చోట్ల.. రైతులు వ్యవసాయ పనుల జోరు పెంచారు.
వరంగల్‌కు వచ్చి కొనుగోళ్లు.. అటు పత్తి విత్తనాల ధరలు రైతులకు అదనపు భారాన్ని మోపుతున్నాయి. గత సంవత్సరం కంటే.. రూ.50 నుంచి రూ.100, రూ.150 వరకూ అధికంగా కంపెనీలు విక్రయిస్తున్నారు. ఇది తమకు భారంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విత్తన ధరలు ఎక్కువ కావటంతో.. మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల నుంచీ రైతులు.. వరంగల్‌కి వచ్చి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
ఇంకెంత పెంచుతారో..పత్తికి డిమాండ్ బాగా ఉండడంతో.. దీన్ని ఆసరాగా చేసుకుని.. పలు కంపెనీలు అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నాయి. వచ్చే వారం, పది రోజుల్లో వ్యవసాయ పనులు మరింత జోరు పెరుగుతాయని.. విత్తన ధరలు ఇంకెంత పెంచుతారోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు విక్రయించేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.